తమిళంలో రీమేక్‌ కానున్న కామెడీ థ్రిల్లర్‌

13 Nov, 2019 16:10 IST|Sakshi

తెలుగులో కామెడీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఇందులో హీరోగా నటించిన నవీన్‌ పొలిశెట్టి తొలి చిత్రంతోనే హిట్‌ సాధించాడు. ఇప్పుడీ సూపర్‌ హిట్‌ సినిమాపై తమిళ ఇండస్ట్రీ కన్నుపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ కమెడియన్‌ కమ్‌ హీరో సంతానం తమిళంలో రీమేక్‌ చేయనున్నారని టాక్‌. వంజగర్‌ ఉలగం అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు మజోజ్‌ బీదా ఈ సినిమాను డైరెక్షన్‌ చేయనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక తారాగణాన్ని త్వరలో చిత్ర యూనిట్‌ వెల్లడించనుంది.

ఇక ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా విషయానికి వస్తే అనాథ శవాల మిస్టరీని చేధించడానికి వెళ్లిన ఏజెంట్‌ సాయి చిక్కుల్లో పడతాడు. ఈ క్రమంలో అతను వాటి నుంచి ఎలా బయటపడతాడు.. ఆ మిస్టరీని ఎలా చేధించాడన్నదే మిగతా కథ. తెలుగులో హిట్‌టాక్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రం హిందీలో కూడా తెరకెక్కించే అవకాశాలు లేకపోలేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది రెండు భాషల్లోనూ ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇక తనదైన కామెడీతో ఎన్నో హిట్లు సాధించిన సంతానం గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌(దిల్లుక్కు దుడ్డు 2, ఏ1)లతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా సంతానం విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

మరిన్ని వార్తలు