సివిల్స్ ప్లాప్.. సినిమా హిట్..!

1 Jul, 2019 08:51 IST|Sakshi

పరిచయం లేకున్నా ప్రయత్నించా..

తొలి చిత్రంతోనే విజయం సాధించా

కొత్త కథలను ప్రోత్సహిస్తా..

యువ సినీ నిర్మాత రాహుల్‌ యాదవ్‌  

అతనికి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేదు.. చిత్రసీమతో అనుబంధం గాని.. అనుభవం గానీ అసలే లేవు. అనుకోకుండా నిర్మాతగా మారి సరికొత్త కథలను తెరకెక్కిస్తున్నాడు నగరానికి చెందిన యువ నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా. సుమంత్‌ హీరోగా ‘మళ్ళీరావా’ అంటూ డీసెంట్‌ హిట్‌ కొట్టి.. రీసెంట్‌గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌తో పాటు హిట్‌ అందుకున్నాడు. బీటెక్‌ చదువుకుని సివిల్స్‌లో ఇంటర్వ్యూ దాకా వెళ్లిన హైదరాబాదీ రాహుల్‌ యాదవ్‌ తన సినీ ప్రస్థానాన్ని, అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు అతడి మాటల్లోనే..

సిటీలో వనస్థలిపురం నా అడ్డా. నాన్న ఉమేష్‌కుమార్‌ యాదవ్‌ వ్యాపారి. అమ్మ సావిత్రి గృహిణి. ఇక్కడే బీటెక్‌ పూర్తి చేశాను. మూడు సార్లు సివిల్స్‌లో ఇంటర్వ్యూ దాకా వెళ్లి అదృష్టం లేక అక్కడే ఆగిపోయాను. ఏదైనా కొత్త రంగంలోకి వెళ్లి అక్కడ విషయాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. అందులో విజయం సాధించడమంటే ఇంకా ఇష్టం. సివిల్స్‌ మిస్సయ్యాక నా ఫ్రెండ్‌ తను చేస్తున్న రైల్వే ప్రాజెక్ట్‌లోకి రమ్మని ఆహ్వానించాడు. నాకు సంబంధం లేని వ్యాపార రంగం.. అందులోనూ రైల్వే. ఛాలెంజింగ్‌ అనిపించి ఆ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా చేరాను. సంవత్సరం పాటు అక్కడే ఉండి రైల్వే లైన్‌ను సక్సెస్‌ఫుల్‌ చేశాం. పాప పుట్టాక సిటీకి వచ్చేశాను. ‘హైదరాబాద్‌ ఎన్‌జీఓస్‌’ గ్రూప్‌లో ఉంటూ అక్కడ స్టార్టప్స్‌ గురించి తెలుసుకునేవాడిని. అలా చాలా వ్యాపారాలపై అవగాహన పెంచుకున్నాను.

అలా నిర్మాతగా మారాను..
కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా దర్శకుడు గౌతం తిన్ననూరి పరిచయమయ్యాడు. నాకు సినిమాలు చూడ్డం తప్ప ఆ ప్రపంచం అంతా కొత్త. అయితే, బుక్స్‌ బాగా చదువుతాను. గౌతం రాసుకున్న కథ, స్క్రిప్ట్‌(మళ్ళీరావా) నేను చదివాను. అతడు చెప్పాలనుకున్న పాయింట్, స్క్రీన్‌ప్లే చాలా బాగా నచ్చింది. గౌతం కథ బాగున్నా నిర్మాతగా ఎవరూ ముందుకు రావట్లేదు. దాంతో నేనే నిర్మాతగా మారాలనుకున్నా. సినిమా నిర్మాణంలో సగభాగం నేను నిర్మాతగా ఉంటాను. మరో నిర్మాతతో కలిసి సినిమా చేద్దాం అని చెప్పాడు. గౌతం కూడా చాలా ట్రై చేశాడు. కానీ ఎవరూ ముందుకు రాకపోయేసరికి నేనే పూర్తి స్థాయి నిర్మాతగా మారాల్సి వచ్చింది.

‘ఏజెంట్‌ స్పై థ్రిల్లర్‌’తో వచ్చా..
మళ్ళీరావా తర్వాత చాలా కథలు విన్నాను. కానీ కొత్తదనం అనిపించలేదు. దర్శకుడు స్వరూప్, నటుడు నవీన్‌ పొలిశెట్టి మిత్రులు. స్వరూప్‌ రాసుకున్న కథను నాకు చెప్పాడు.. థ్రిల్లింగ్‌గా అనిపించింది.  స్పై సినిమాలు వస్తుంటాయి. కానీ తెలుగుతో లోకల్‌ ఏజెంట్‌గా స్పై థ్రిల్లింగ్‌ మూవీలు వచ్చి చాలా ఏళ్లయింది. మెగాస్టార్‌ చిరంజీవి ‘చంటబ్బాయి’ తర్వాత కామెడీతో పాటు థ్రిల్లర్‌ మూవీలు రాలేదు. కథ కొత్తగా.. చాలా బాగుంది. నవీన్‌ హైదరాబాదీ. భోపాల్‌ ఎన్‌ఐటీలో చదివి అక్కడే యూట్యూబ్‌ చానల్‌లో తన సత్తాను చాటాడు. తెలుగువాడు బాలీవుడ్‌ సోషల్‌ మీడియాలో సక్సెస్‌ అవడం అంటే మామూలు విషయం కాదు. నవీన్‌లో ఈజ్‌తో పాటు అన్ని షేడ్స్‌ ఉన్నాయి. నవీన్‌–స్వరూప్‌ కథలోని కొన్ని మలుపులు, కొత్తదనంతో ఫైనల్‌ స్క్రిప్ట్‌తో రెడీ అయ్యారు.  నెల్లూరులోనే పూర్తి షూటింగ్‌.. 65 శాతం కొత్తవాళ్లతో  వైవిద్యంగా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ టైటిల్‌ పెట్టాం. నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. అక్కడే షూటింగ్‌. అనుకున్న ప్రకారం సినిమాను పూర్తి చేశాంగానీ రిలీజ్‌ కష్టాలు మొదలయ్యాయి. బడా డిస్ట్రిబ్యూటర్స్‌ సినిమా చూసి పెదవి విరిచారు. నమ్మకం లేదని తేల్చి చెప్పారు. దాంతో మేమే సొంతంగా రిలీజ్‌ చేసుకున్నాం. సిటీలో మొదటి రోజు 9 షోలతో రిలీజ్‌ చేశాం. సాయంత్రానికి విమర్శకుల ప్రశంశలతో పాటు సినిమా అభిమానులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆదివారానికి 64 షోలు నగరంలో పడ్డాయి. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటారని మరోసారి రుజువు చేశారు. ఇండస్ట్రీలో కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందించాలి. టాలెంట్‌కే నా ఓటు. కొత్త కథతో ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తాను. వైవిధ్య కథలతో ప్రేక్షకుల మెప్పు పొంది తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచాలన్నది నా ప్రయత్నం.. అంటూ ముగించారు రాహుల్‌ యాదవ్‌.

మొదటిసారి భయమేసింది..
‘మళ్ళీరావా’ కథను హీరో సుమంత్‌కి చెప్పాం. తనకి బాగా నచ్చి చేద్దామన్నాడు. కానీ ఎక్కడో చిన్న భయం. అనుకున్న బడ్జెట్‌ దాటిపోతుందనుకున్నాం. ఈ విషయాన్ని సుమంత్‌కి చెబితే.. తను మాలోని భయాన్ని పోగొట్టి సినిమాకు చాలా సహకరించారు. అనుకున్న బడ్జెట్‌ కన్నా తక్కువలోనే పూర్తి చేశాం. వీటి తర్వాత రిలీజ్‌ కష్టాలు మొదలయ్యాయి. సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ సినిమా మీదున్న నమ్మకంతో మేమే రిలీజ్‌ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. భారీ లాభాలు రాకపోయినా లాభాలతో కొత్తగా చిత్రాన్ని నిర్మించామన్న సంతృప్తి మిగిలింది. నాలో సినిమాపై నమ్మకాన్ని, ధైర్యాన్ని రెట్టింపు చేసింది.-సత్య గడేకారి

మరిన్ని వార్తలు