అలా జరిగింది

6 Jan, 2019 02:32 IST|Sakshi
ఐశ్వర్యా రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌

న్యూ యార్క్‌... ఓ స్టార్‌ హోటల్‌ బాల్కనీలో నిలబడి ఆలోచిస్తున్నాడు అభిషేక్‌ బచ్చన్‌. ‘ఏదో రోజు తనతో (ఐశ్వర్య) కలిసి జీవిస్తే ఎంత బావుండు?’ అన్నది ఆ ఆలోచనల సారాంశం.  కొన్నేళ్ల తర్వాత.. ఐశ్వర్యారాయ్, అభిషేక్‌ నటించిన ‘గురు’ ప్రీమియర్‌ సమయం. అదే న్యూ యార్క్‌. అదే హోటల్‌.  సినిమా ప్రీమియర్‌ పూర్తయింది. హోటల్‌ బాల్కనీలో తన అభిప్రాయాన్ని ఐష్‌తో చెప్పాడు అభిషేక్‌. అప్పటికి ఐష్‌కి ఇవ్వడానికి అతని వద్ద డైమండ్‌ రింగ్‌ లేదు.

సినిమా షూటింగ్స్‌ కోసం వాడే డమ్మీ డైమండ్‌ రింగ్‌తో మోకాళ్ల మీద నిలబడి ప్రపోజ్‌ చేశాడు. ఆయన సంకల్పం బలమైంది. అందుకే ప్రపోజల్‌లోని ప్రాపర్టీస్‌ని పట్టించుకోలేదు.. కేవలం ప్రేమను మాత్రమే చూశారు ఐష్‌. ఈ లవ్‌స్టోరీను కొన్ని సందర్భాల్లో పంచుకున్నారు అభిషేక్‌. ఆ తర్వాత పెళ్లి ఎలా జరిగిందో పూర్తిగా మాట్లాడలేదు. తాజాగా  ఐశ్వర్యా రాయ్‌ తమ నిశ్చితార్థం ఎలా జరిగిందో వివరిస్తూ – ‘‘అభిషేక్‌ నాకు ప్రపోజ్‌ చేసిన కొన్ని  రోజుల తర్వాత ఓ రోజు సడన్‌గా ఫోన్‌ చేశాడు. 

‘మేం మరికొంతసేపట్లో మీ ఇంటికి బయలుదేరుతున్నాం, నిశ్చితార్థం చేసుకోవడానికి’ అన్నది సారాంశం. నాకేం అర్థం కాలేదు. మా నాన్నగారు కూడా ఇంట్లో లేరు. ఏం చేయాలో తోచలేదు. మా ఇంటికి అభిషేక్‌ ఫ్యామిలీ సడన్‌గా వచ్చేశారు. ‘పదండి ఇంటికి వెళ్దాం’ అని అమితాబ్‌జీ అన్నారు.   ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది... అద్భుతమైన క్షణాలు అనుకోకుండానే కదా జరిగేది అని. నా నిశ్చితార్థం కూడా అలానే జరిగింది.  మేం సౌతిండియన్స్‌ కాబట్టి నిశ్చితార్థ వేడుకను నార్త్‌లో ‘రోకా’ అంటారని కూడా తెలియదు. 

జనవరి 14న మా నిశ్చితార్థం జరిగింది. అది బయటకు చెప్పలేదు కూడా.  అప్పుడు హృతిక్‌తో ‘జోధా అక్బర్‌’ సినిమా చేస్తున్నా. నిశ్చితార్థం జరిగిన తర్వాత సినిమాలో  పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే సన్నివేశం తీయాలి. ఆఫ్‌ స్క్రీన్, ఆన్‌ స్క్రీన్‌ ఒకేలాంటి ఫేజ్‌లో ఉండటం భలే విచిత్రంగా అనిపించింది.  ఆ తర్వాత కొన్ని రోజులకు మా ఎంగేజ్‌మెంట్‌ గురించి అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశాం. ఆ ఏడాది (2007) ఏప్రిల్‌లోనే పెళ్లి చేసుకున్నాం. తర్వాత మీకు తెలిసిందే. ఇప్పటికి మా పెళ్లి అయ్యి పదకొండేళ్లు అవుతోంది. హ్యాపీగా ఉన్నాం’’ అంటూ స్వీట్‌ మెమొరీస్‌ని స్వీట్‌గా రివైండ్‌ చేసుకున్నారు ఐశ్వర్యా రాయ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా