కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన హీరోయిన్‌

30 Oct, 2019 12:27 IST|Sakshi

తమిళ నటీమణులకో సంఘం కావాలి 

తమిళ సినీ నటీమణుల సమస్యలను పరిష్కరించడానికి ఒక సంఘం కావాలని నటి ఐశ్వర్యారాజేశ్‌ పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉంటే ఏ తరహా పాత్రనైనా నటించడానికి సై అనే ఈమె ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే శివకార్తికేయన్‌కు చెల్లెలిగా నటించిన నమ్మ వీట్టుపిళై చిత్రం తెరపైకి వచ్చింది. నటిగా బిజీగానే ఉన్న ఈ అమ్మడు తమిళ నటీమణులకు ఇప్పడం లేదంటూ ఫైర్‌ అయ్యారు. తమిళ నటీమణుల పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ హిందీ చిత్రాల్లో హిందీ నటీమణులే నటిస్తున్నారు. మలయాళం చిత్రాల్లో మలయాళీ నటీమణులే నటిస్తున్నారు. కానీ తమిళ చిత్రాల్లో మాత్రం తమిళ నటీమణులు నటించడం లేదు అని దుయ్యబట్టా రు. నటి రెజీనా, సమంత ఇద్దరు తమిళ నటీమణులే. అయినా ప్రారంభదశలో తమిళ సినిమాల్లో అవకాశాలు రాలేదన్నారు. 

తెలుగులో మాస్‌ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న తరువాత వారిని కోలీవుడ్‌ రెడ్‌ కార్పెట్‌ పరచి ఆహ్వానించింది. నటి ధన్సిక చక్కగా తమిళ భాషను మాట్లాడే నటి అని, ఆమెకు సరైన అవకాశాలు లేవని అన్నారు. నటి జననీ అయ్యర్, వరలక్ష్మీశరత్‌కుమార్‌  తమిళ భాషను చక్కగా మాట్లాడే వారేనని, అయినా భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం లేదని అన్నారు. ఫెమీనా మిస్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న అనూకీర్తి తిరుచ్చిరాప్పల్లికి చెందిన అచ్చ తమిళ అమ్మాయి అని, ఆమె మిస్‌ ఇండియా పట్టం గెలుచుకున్న తరువాతనే తను ఎవరన్నది తెలిసిందన్నారు. ఇలాంటి అనుకీర్తీలు తమిళనాడులో చాలా మంది ఉన్నారని, మనమే వారిని గుర్తించలేకపోతున్నామని అన్నారు. తమిళ యువతిలు నటించడానికి వస్తే వారిని గౌరవించడం లేదన్నారు. సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదన్నారు.  

ముంబై నుంచి వస్తున్న నటీమణులకు ఇస్తున్న గౌరవంలో ఒక వంతు కూడా మనవారికి దక్కడం లేదని వాపోయారు. ఉత్తరాది నుంచి వచ్చే నటీమణులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్న తమిళ సినిమా మన ఊరు నటీమణులను ఎందుకు సరిగ్గా చూడడం లేదన్న బాధ తనకు కలుగుతోందన్నారు. తనకు ఎదురైన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడడంలేదని, తమిళ నటీమణులందరికీ ఇదే పరిస్థితి అని అన్నారు. తమిళ అమ్మాయిలు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు. కథలోని పాత్రలకు అనుగుణంగా మనం యథార్థంగా ఉంటే చాలని, అందం ప్రధానం కాదని అన్నారు. అయితే కమర్శియల్‌ చిత్రాల్లో మనం గ్లామర్‌గా కనిపించాలన్నారు. లేకపోతే మన ఊరు ప్రజలే  ఎగతాళి చేస్తారని అన్నారు. అందుకే మన ఊరి అమ్మాయిలు సినిమాల్లోకి ఎక్కువగా రావడానికి ఒక సంఘాన్ని ప్రారంభించి వారి సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందన్నారు. అందుకు కావలసిన అన్ని విధాల సహకారాన్ని తాను అందిస్తానని నటి ఐశ్వర్యారాజేశ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు