రెండు రోజులు నిద్రే రాలేదు

2 Oct, 2019 07:28 IST|Sakshi

సినిమా: రెండు రోజులు నిద్ర పట్టక చాలా శ్రమపడ్డానని అంటోంది నటి ఐశ్వర్యరాజేశ్‌. ఎలాంటి అసాధారణ పాత్రకు అయినా దర్శకుల దృష్టి పడేది ఈ అమ్మడిపైనే అనడంలో అతిశయోక్తి ఉండదేమో. నటిగా ఆరంభ దశలోనే కాక్కాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకున్న నటి ఐశ్వర్యరాజేశ్‌.  ఇటీవల శివకార్తికేయన్‌ హీరోగా నటించిన నమ్మ వీట్టు పిళ్లై చిత్రంలో ఆయనకు చెల్లెలిగా నటించి మెప్పించింది. నటుడు కమలహాసన్‌తో ఇండియన్‌–2 వంటి భారీ క్రేజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా వదులుకుందీ భామ. ఆ విషయం తనను చాలా రోజులు బాధించిందంటున్న ఐశ్వర్యరాజేశ్‌ మాట్లాడుతూ అవును తనకు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్‌–2 చిత్రంలో నటించే అవకాశం వచ్చిన విషయం నిజమేనని అంది.

అయితే ఈ చిత్రం కోసం గత డిసెంబర్‌లో కాల్‌షీట్స్‌ అడిగారని చెప్పింది. ఆ విధంగా కాల్‌షీట్స్‌ కేటాయించానని, అయితే ఆ చిత్రం షూటింగ్‌ వాయిదా పడి ఈ ఏడాది ఆగస్ట్‌ నెలలో ప్రారంభమైందని తెలిపింది. అయితే ఆగస్ట్‌లో తాను వేరే చిత్రాలకు కాల్‌షీట్స్‌ కేటాయించడం, ఆ చిత్ర షూటింగ్‌ వేగంగా జరగడంతో ఇండియన్‌–2 చిత్రానికి కాల్‌షీట్స్‌ సమస్య తలెత్తిందని చెప్పింది, దీంతో ఆ చిత్రాన్ని వదులుకోక తప్పనిపరిస్థితి అని అంది. ఇది తనకు చాలా బాధను కలిగించిన విషయం ఇదేనని చెప్పింది. పెద్ద సినిమా, కమలహాసన్‌ వంటి నటుడు, శంకర్‌ వంటి దర్శకుడు కాంబినేషన్‌లో నటించే అవకాశాన్ని వదులుకోవడంతో రెండు రోజులు నిద్ర పోవడానికి కష్టపడ్డానని చెప్పింది. ఆ బాధ నుంచి బయట పడడానికి చాలా రోజులు పట్టిందని నటి ఐశ్యర్యరాజేశ్‌ పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వానం కొట్టటం, కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం, కా.పే.రణసింగమ్‌ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తోంది. ఇక ధనుష్‌కు జంటగా వడచెన్నై–2 చిత్రంలోనూ నటించడానికి కమిట్‌ అయ్యింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా