బాలీవుడ్లో మాటల యుద్ధం

2 Sep, 2016 11:57 IST|Sakshi
బాలీవుడ్లో మాటల యుద్ధం

బాలీవుడ్ లో భారీ చిత్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అక్టోబర్ 28న శివాయ, యే దిల్ హై ముష్కిల్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచారం, రివ్యూల విషయంలో వివాదం మొదలైంది. శివాయ చిత్ర హీరో దర్శకుడు అయిన అజయ్ దేవగన్ తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేసిన ఓ ఆడియో క్లిప్ వివాదానికి తెర తీసింది.

ఆడియో క్లిప్ లోని గొంతు ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్దిగా చెప్పిన అజయ్ దేవగన్, ఆయన తన శివాయ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేసేందుకు 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా తెలిపాడు. ఈ విషయాన్ని శివాయ చిత్ర మరో నిర్మాత కుమార్ మంగత్కు కమాల్ ఫోన్ లో చెపుతుండగా రికార్డ్ చేసిన ఆడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టుగా తెలిపారు.

ఈ సందర్భంగా..' నేను 25 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాను. నా తండ్రి యాక్షన్ డైరెక్టర్గా ఇక్కడే పనిచేశారు. అందుకే ఈ రంగంతో నాకు ఎంతో అనుబందం ఉంది. ఇలాంటి రంగంలో కమాల్ ఆర్ ఖాన్ లాంటి వాళ్లు చేస్తున్న పనులు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారే ఇండస్ట్రీ నాశనానికి సపోర్ట్ చేయటం బాధాకరం. ఈ విషయంలో కరణ్ జోహర్ ప్రమేయం ఉందా లేదా అన్న విషయం పై కూడా విచారణ జరగాలి' అని తెలిపారు.

అజయ్ స్టేట్ మెంట్పై కమాల్ కూడా ఘూటుగానే స్పందించాడు. వారి సినిమాను ఇబ్బంది పెట్టే లైసెన్స్ నాకు ఇచ్చినందుకు అజయ్ దేవగన్, కుమార్ మంగత్లకు నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ ట్వీట్లపై కరణ్ జోహార్ మాత్రం స్పందించలేదు.