కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

31 Mar, 2020 12:26 IST|Sakshi

ముంబై: తన భార్య కాజోల్‌, కుమార్తె నైసా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కోవిబడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీలంతా ఇంట్లోనే గడుపుతూ కుటుంబంతో కలిసి ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. (తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి)

ఈ క్రమంలో కాజోల్‌ సైతం తన ఫొటోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాజోల్‌, ఆమె కూతురు నైసా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. సింగపూర్‌లో విద్యనభ్యసిస్తున్న నైసాను రిసీవ్‌ చేసుకోవడానికి కాజోల్‌ అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో నైసా ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డారని.. కాజోల్‌కు కూడా ప్రమాదం పొంచి ఉందంటూ వదంతులు వ్యాపించాయి.

ఈ రూమర్లపై స్పందించిన అజయ్‌.. ‘‘మీరు ఈ విషయం గురించి అడుగుతున్నందుకు ధన్యవాదాలు. కాజోల్‌, నైసా బాగున్నారు. వారి ఆరోగ్యం గురించి ప్రచారం అవుతున్న పుకార్లు అవాస్తవాలు. నిరాధారమైనవి’’అని ట్విటర్‌లో స్పష్టం చేశారు. కాగా హల్‌చల్‌, గూండారాజ్‌, ఇష్క్‌, దిల్‌ క్యా కరే, రాజూ చాచా, ప్యార్‌ తో హోనా హై థా వంటి సినిమాల్లో కలిసి నటించిన కాజోల్‌- అజయ్‌.. 1999లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్‌ సంతానం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు