యుద్ధనేపథ్యంలో అజయ్ దేవగన్ సినిమా

30 Jul, 2016 11:05 IST|Sakshi
యుద్ధనేపథ్యంలో అజయ్ దేవగన్ సినిమా

బాలీవుడ్ ప్రముఖులు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల మీద దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే నీర్జా, ఎయిర్ లిఫ్ట్, రుస్తుం లాంటి సినిమాలు ఈ జానర్లో తెరకెక్కినవే. సీనియర్ హీరో అజయ్ దేవగన్ మరో అడుగు ముందుకేసి స్వతంత్రోధ్యమ కాలంనాటి ఓ సాహసోపేత యుద్ధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సన్స్ ఆఫ్ సర్థార్ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ద బ్యాటిల్ ఆఫ్ సారాగరి అనేది ట్యాగ్ లైన్.

చరిత్రలో భారతీయ సైనికుల కీర్తిని ఎంతో ఉన్నతంగా చూపించిన అద్భుతపోరాటం సారాగరి. 1897 సెప్టెంబర్ 12న ఈ యుద్ధం జరగగా ఇప్పటికీ సెప్టెంబర్ 12ను సారాగరి దినంగా జరుపుకుంటారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న బలోచిస్తాన్ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం సారాగరి. అక్కడి కోటలో బస చేస్తున్న 21 మంది భారత సైనికుల మీదకు పది వేల మంది ఆఫ్ఘన్ సైనికులు ఒక్కసారిగా దండెత్తి వచ్చారు.

అయితే పోరాటం తప్ప వెనకడుగు వేయటం తెలియని ఆ భారత కొదమ సింహాలు ఆ సేనలతో పోరాడాటానికే సిద్ధమయ్యాయి. రాత్రి వరకు జరిగిన భీకరపోరులో 180 మంది ఆఫ్ఘన్ సైనికులను మట్టుబెట్టిన 21 మంది భారత సైనికులు పోరాటంలోనే నేలకొరిగారు. హాలీవుడ్ సినిమా 300ను గుర్తుకు తెచ్చే ఈ చారిత్రక సంఘటనను ఇప్పుడు వెండితెర మీద ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాడు అజయ్ దేవగన్. సినిమాకు సంబందించిన నటీనటులు, సాకేంతిక నిపుణుల వివరాలను వెల్లడించాల్సి ఉంది.