ఆరు రోజుల్లో రూ. 107 కోట్లు.. థాంక్యూ!

17 Jan, 2020 10:40 IST|Sakshi

మరాఠా యోధుడు తాన్హాజీ మలుసరే జీవితం ఆధారంగా అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ . శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. నిలకడగా వసూళ్లు రాబడుతున్న తాన్హాజీ.. త్వరలోనే రూ. 150 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతోందని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘తాన్హాజీ’ సినిమాను విజయవంతం చేసినందుకు హీరో అజయ్‌ దేవగణ్‌ ప్రేక్షకులకు కృతఙ్ఞలు తెలిపాడు. ఈ మేరకు సినిమా కలెక్షన్లతో కూడిన పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసిన అజయ్‌... ‘ ఇంతటి విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, మద్దతు, ప్రశంసలను అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా’ అని ఆనందం వ్యక్తం చేశాడు.  

చదవండి: తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: కాజోల్‌

కాగా దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌, ఆయన భార్య కాజోల్‌ రీల్‌ లైఫ్‌ భార్యాభర్తలుగా కనిపించారు. ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్‌ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. ఇక తాన్హాజీతో పాటు అదే రోజు విడుదలైన దీపికా పదుకొనే సినిమా ఛపాక్‌ మాత్రం వసూళ్లలో వెనకబడిపోయింది. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛపాక్‌.. ఆరు రోజుల్లో కేవలం రూ. 26 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇదిలా ఉండగా.. ఛపాక్‌ విడుదలకు ముందు దీపిక.. ఢిల్లీలోని జేఎన్‌యూను సందర్శించడం వసూళ్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక దీపిక సినిమాకు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించగా.. అజయ్‌ తాన్హాజీకి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వెసలుబాటు కల్పించింది.

తాన్హాజీ ట్రైలర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు