తొలి సినిమా అంటే జోక్ కాదు: అక్కినేని అఖిల్‌

26 Jul, 2013 01:15 IST|Sakshi
తొలి సినిమా అంటే జోక్ కాదు: అక్కినేని అఖిల్‌
తెరంగేట్రం విషయంలో ఏ హీరోపై రానన్ని రూమర్లు అక్కినేని అఖిల్‌పై వస్తున్నాయి. తెలుగునాట అఖిల్‌కి ఉన్న క్రేజ్‌కి ఈ రూమర్లే నిదర్శనం. ‘అఖిల్ తొలి సినిమాకు రాజమౌళి దర్శకుడు’ అనే వార్త ఆ మధ్య హల్‌చల్ చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ తొలి సినిమా చేయనున్నారు’ అనే వార్త కూడా ఓ రేంజ్‌లో మీడియాలో హడావిడి చేసింది. ‘అక్కినేని ఫ్యామిలీ సినిమా ‘మనం’లో అఖిల్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు’ అనేది రీసెంట్ గాసిప్. ఓ హీరో తెరంగేట్రంపై ఇన్ని గాసిప్పులు రావడం సాధారణమైన విషయం కాదు. తన అరంగేట్రంపై ఇప్పటివరకూ పెదవి విప్పని అఖిల్... ఈ రూమర్ల కారణంగా వివరణ ఇచ్చుకోక తప్పలేదు. తొలిసారి ట్విట్టర్ ద్వారా తన మనోగతాన్ని తెలియజేశారాయన.
 
‘‘హీరోగా రావడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్న మాట నిజం. నేను ఫలానా సినిమాలో నటిస్తున్నాను, ఫలానా దర్శకుడు నా సినిమాకు పనిచేస్తున్నారు అనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. అందరూ అనుకుంటున్నట్లు నేను ఏ సినిమాకూ సైన్ చేయలేదు. తొలి సినిమా అంటే జోక్ కాదు. కెరీర్‌లో దాని ప్రాముఖ్యత అంతా ఇంతా ఉండదు. అందుకే పెద్దల సలహాలను, సూచనలనూ తీసుకుంటున్నాను. అలాగే మంచి కథను ఎన్నుకునే పనిలో ఉన్నాం. హీరోగా నా ఆగమనం కోసం అందరూ ఎంత ఆత్రుతగా ఉన్నారో, అంతకు మించిన ఎగ్జయిట్‌మెంట్‌తో నేనూ ఉన్నాను. ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వగానే... నేనే స్వయంగా ప్రకటిస్తా. అప్పటిదాకా నిశ్శబ్దంగా నా కెరీర్‌లో ప్రధాన ఘట్టం కోసం నేను సమాయత్తం అవుతూ ఉంటా’’ అని చెప్పారు.