హలో... అప్పుడు రావడం పక్కా!

22 Oct, 2017 01:07 IST|Sakshi

ఏడు నెలల క్రితం ఎంతో ఎగై్జటింగ్‌గా అఖిల్‌ ‘హలో... కొత్త సినిమా స్టార్ట్‌ చేశా గురూ’ అన్నారు. ఏడు నెలల తర్వాత ఇప్పుడూ అంతే ఎగై్జటింగ్‌గా ‘హలో.. లాస్ట్‌ షెడ్యూల్‌లోకి ఎంటరయ్యా’ అంటున్నారు. సినిమా స్టార్ట్‌ అయినప్పుడు ఎంత ఎగై్జటెడ్‌గా ఉన్నారో... ఎండింగ్‌కి వచ్చేసరికి అంతే ఎగై్జటెడ్‌గా ఉన్నారు అఖిల్‌. దాన్ని బట్టి షూటింగ్‌ని ఎంత ఎంజాయ్‌ చేస్తున్నారో ఊహించవచ్చు.

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘హలో’ చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్‌ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అఖిల్‌ తలకిందులుగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత గాల్లో ఎగురుతున్నట్లు ఉన్న సెకండ్‌ స్టిల్‌ కూడా సూపర్‌ అనిపించుకుంది. హిట్‌ కాంబినేషన్‌ కావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.

అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిన నెల డిసెంబర్‌. నాగార్జున నటించిన పలు చిత్రాలు ఈ నెలలోనే విడుదలై, మంచి హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్‌ని బట్టి చూస్తే.. ‘హలో’ కూడా హిట్టే అని ఫిక్సయ్యారు అక్కినేని అభిమానులు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కూతురు కల్యాణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ‘‘ముందు చెప్పినట్లే డిసెంబర్‌ 22న సినిమా విడుదలవుతుంది. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతా’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు అఖిల్‌.

మరిన్ని వార్తలు