నా జీవితంలో ఆ రెండూ ప్లాన్‌ చేయకుండా జరిగినవే!

12 Dec, 2019 00:22 IST|Sakshi
నాగచైతన్య

‘‘జీవితంలో మనకు ఎదురయ్యే వైఫల్యాలే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నేనూ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. అప్పుడు నా నిర్ణయ లోపం ఎక్కడ ఉందో పరిశీలించుకుంటాను. నటుడిగా నన్ను మరింత మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తాను. సినిమా విడుదల సమయంలో సోషల్‌ మీడియా కామెంట్స్‌ని పట్టించుకుంటాను.

కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చూస్తుంటాను. కానీ ఆ  విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుని ముందుకు వెళ్లినప్పుడే లైఫ్‌ బాగుంటుంది’’ అన్నారు నాగచతైన్య. కేఎస్‌ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం ‘వెంకీమామ’. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగచైతన్య చెప్పిన విశేషాలు.

► భీమవరంలో మొదలైన ఈ కథ కశ్మీర్‌లో ముగుస్తుంది. కాలేజ్‌ సెలవుల్లో నేను భీమవరం వెళ్లినప్పుడు వెంకీమామతో నా సందడి మొదలవుతుంది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర చేశాను.

► ఈ సినిమాలో కెమెరా వెనకాల సురేష్‌ మావయ్య, కెమెరా ముందు వెంకటేష్‌ మావయ్య నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. వెంకటేష్‌ మావయ్యకు ‘నో హేటర్స్, నో నెగటివ్స్‌’ అని అందరూ అంటుంటారు.  అలా ఎందుకు అంటారో నాకు సెట్‌లో అర్థమైంది. వెంకటేష్‌ మావయ్య ఆయన కామెడీ టైమింగ్‌ను మ్యాచ్‌ చేయడం కష్టం. సురేష్‌మావయ్య, వెంకటేష్‌ మావయ్య ప్రణాళిక ప్రకారం అన్నీ  జరగాలనుకుంటారు. లేకపోతే కోపం వస్తుంది. ఆ కోపం అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.  

► సురేష్‌మావయ్య కథలు వినమని అప్పుడప్పుడు స్క్రిప్ట్స్‌ పంపిస్తుంటారు. నేను వింటుంటాను. కానీ సురేష్‌ ప్రొడక్షన్స్‌లో సినిమా చేసే అవకాశం ఎందుకో ఇప్పటివరకు కుదర్లేదు. ఇప్పుడు ‘వెంకీమామ’తో కుదరింది. ఇందులో వెంకటేష్‌ మావయ్యతో కూడా కలిసి చేశాను. ఇలా ఒకేసారి, ఒకే ఏడాది ఈ రెండూ జరిగాయి. కానీ ఇది ప్లాన్‌ చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా జీవితంలో పెళ్లి, ‘వెంకీమామ’ ప్లాన్‌ చేసినవి కాదు.

► ‘వెంకీమామ’ మల్టీస్టారర్‌ కాదనే నా అభిప్రాయం. వెంకటేష్‌గారితో కలిసి నేను ఓ క్యారెక్టర్‌ చేశానంతే. ఈ కథకు నేను ప్లస్‌ కాదు. ఈ కథే నాకు ప్ల్లస్‌ అనుకంటున్నాను. ఈ సినిమాలో విలన్స్‌ లేరు. పరిస్థితులు, జాతకాల ప్రభావం సినిమాలో పాత్రలపై ప్రతికూలతలను చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.

► సినిమా నేను రఫ్‌గా మొత్తం చూశాను. బాగుంది. సమంత (నాగచైతన్య భార్య) కూడా చూసింది. బాగుందని చెప్పింది. ఈ సినిమానే కాదు నా ప్రతి సినిమా గురించి తన అభిప్రాయం నిర్మొహమాటంగా చెబుతుంది. నేనూ తన సినిమాలకు అంతే చెబుతాను.

► ఈ సినిమా కథను నాన్నగారు (నాగార్జున) వినలేదు. సురేష్‌మామ పంపిన కథ విని నేనే ఓకే చేశాను. నాన్నగారితో (సొగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్‌ గురించి ప్రస్తావిస్తూ) చేయాల్సిన ప్రాజెక్ట్‌కు ఇంకా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. నాన్నగారు,  వెంకటేష్‌ మామలో ఉన్న కామన్‌ పాయింట్‌ ఏంటంటే ఇద్దరూ కామ్‌ పర్సనాలిటీస్‌. కానీ నిర్ణయాలు మాత్రం చాలా వేగంగా తీసుకుంటారు.  

► నేను డైరెక్టర్స్‌ యాక్టర్‌ని. ఒకసారి స్క్రిప్ట్‌ లాక్‌ అయిన తర్వాత డైరెక్టర్‌ చెప్పింది చేసుకుని వెళ్తుంటాను. అనుభవం ఉన్న దర్శకులు అయితే నా నుంచి మరింత నటనను రాబట్టుకోగలరని నా అభిప్రాయం. కొత్త దర్శకులు అయితే నన్ను మరో టేక్‌ చేయమని చెప్పడానికి మోహమాట పడొచ్చు. అలా యాక్టింగ్‌ పరంగా నాకు తెలియకుండానే నేను రాజీపడాల్సి వస్తుందేమో. అందుకే కెరీర్‌లో రెండుమూడు మంచి హిట్స్‌ సాధించిన తర్వాత కొత్త దర్శకులతో సినిమాలు చేస్తాను. కొత్త దర్శకులు డిఫరెంట్‌ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతకాలం అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలనుకునే నా ఆలోచన నాకొక బలహీనత కూడా కావొచ్చు.

► శేఖర్‌కమ్ములగారి దర్శకత్వంలో చేస్తున్న ‘లవ్‌స్టోరీ’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణ 40 శాతం పూర్తయింది.

మరిన్ని వార్తలు