బిగ్‌బాస్‌ చూస్తున్నాడు

22 Sep, 2019 09:05 IST|Sakshi

యువతా మేలుకో.. విలువైన ప్రాణాలు కాపాడుకో

మెట్రోరైల్‌ డోర్స్‌ క్లోజయ్యే వేళ జర జాగ్రత్త  

ప్రయాణికుల భద్రతే మెట్రో ప్రధాన లక్ష్యం  

అవగాహన కల్పించడం ఎంతో ఆనందం  

సినీ నటుడు అక్కినేని నాగార్జున

‘మెట్రో రైలు ఎక్కేప్పుడు జాగ్రత్త. డోర్స్‌ క్లోజ్‌ అయ్యేప్పుడు సడన్‌గా ఎక్కొద్దు. అలా చేస్దే మీ వీపునకు తగిలించుకున్న బ్యాగులు డోర్స్‌లో చిక్కుకుంటున్నాయి. దీంతో సాంకేతిక లోపాలతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం’ ఉంటాయన్నారు సినీ నటుడు అక్కినేని నాగార్జున. ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ‘బిగ్‌బాస్‌– 3’ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. ‘బిగ్‌బాస్‌’ మిమ్మల్ని చూస్తున్నాడనే పోస్టర్‌ని శనివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లోని బాల్‌రూమ్‌లో ‘స్టార్‌– మా’ నెట్‌వర్క్‌ బిజినెస్‌ హెడ్‌ అలోక్‌జైన్, ఎల్‌ఎన్‌టీహెచ్‌ఎల్‌ ఎండీ, సీఈఓ కె.వి.బి.రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం కొద్దిసేపు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు నాగ్‌.ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు వెళ్లిపోతోందనే కంగారు వద్దు. మన సిటీలో ప్రతి పది నిమిషాలకో మెట్రో రైలు సదుపాయం ఉంది. మీరు త్వరగా మీ గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఓ పదిహేను నిమిషాలు ముందుగానే బయలుదేరండి. హడావుడిలో మెట్రో రైలు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలను కోల్పొవద్దు. మన మెట్రో ఎంతో మర్యాదకరమైనది. ఆ మర్యాదను కాపాడి ఇతర సిటీలకు మనం మార్గదర్శకంగా ఉందాం.  – నాగార్జున  

మెట్రో టీవీ స్క్రీన్‌లపై ప్రచారం..
‘బిగ్‌బాస్‌’ మిమ్మల్ని చూస్తున్నాడు అనే ప్రచారాన్ని నగరంలోని మెట్రో స్టేషన్‌లలో చేయనున్నాం. మెట్రోలో ఉన్న టీవీ స్క్రిన్‌లపై, మెట్రో స్టేషన్‌లో టీవీ స్క్రీన్‌లపై ప్రచారాలు ప్రదర్శిస్తాం. ఇటీవల కాలంలో చాలా మంది యువత త్వరగా వెళ్లాలన్నా హడావుడిలో డోర్స్‌ క్లోజయ్యే టైంలో మెట్రో రైలు ఎక్కుతున్నారు. దీంతో వారు వెనక తగిలించుకున్న బ్యాగ్‌ కాస్త డోర్స్‌ మధ్య చిక్కుకుంటుంది. దీంతో ప్రతి స్టేషన్‌లో మెట్రో రైలు ఆరు నుంచి పది సెకన్లు పాటు స్లో అవుతోంది. వీటిని సీసీ కెమెరాల ద్వారా ‘బిగ్‌బాస్‌’ గమనిస్తుంటాడు. అలా చేయొద్దంటూ టీవీల్లో ప్రకటనలు టెలికాస్ట్‌ కానున్నాయి. 

ప్రాణాలను కాపాడేందుకే..  
మన ప్రాణాలు ఎంతో విలువైనవి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఒక్కోసారి తొందరలో మెట్రోరైలు ఎక్కుతున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా కాలు స్కిడ్‌ అయ్యి కిందపడే ప్రమాదం ఉంది. ఆ సమయంలో కిందపడిన వ్యక్తికి ఏదైనా జరిగితే?  అందుకే.. విలువైన ప్రాణాలను కాపాడే కాన్సెప్ట్‌కి..‘బిగ్‌బాస్‌’ మిమ్మల్ని చూస్తున్నాడంటూ ప్రకటనలు వస్తుంటాయి.  మెట్రో రైలు ఎక్కేటప్పుడు, దిగేప్పుడు జాగ్రత్తలు పాటిస్తారని ‘మా’ నమ్మకం.

గొప్ప అనుభూతి..
మెట్రో ప్రయాణం అనేది చాలా మర్యాదతో కూడుకున్నది. ఆ మర్యాదను, ప్రతిష్టను ప్రయాణికులుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ‘బిగ్‌బాస్‌– 3’ సీజన్‌ పూర్తయ్యే వరకు మెట్రో ప్రయాణాలపై, మర్యాదలపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించడమనేది ఓ గొప్ప అనుభూతి. ‘బాగ్‌బాస్‌– 3’ అతిపెద్ద ప్రాపర్టీ షో. ‘స్టార్‌– మా, మెట్రో’కు ప్రత్యేక ధన్యవాదాలు.

మరిన్ని వార్తలు