ట్రైలర్‌ చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి

2 Apr, 2019 03:03 IST|Sakshi
హరీష్‌ పెద్ది, నాగచైతన్య, నాగార్జున, సమంత, వెంకటేశ్, శివ నిర్వాణ, సాహు గారపాటి

– నాగార్జున

‘‘ఏ మాయ చేసావె’ సినిమా చూసినప్పుడు చైతు, సమంత చక్కటి జంట అనుకున్నా. ‘మనం’  సినిమాలో వీళ్లిద్దరూ నాతో కలిసి నటించారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని నాకు అప్పుడు తెలియదు. నాకు ఏమాత్రం తెలియకుండా సైలెంట్‌గా రొమాన్స్‌ చేస్తున్నారని ఆ తర్వాత తెలిసింది’’ అని నాగార్జున అన్నారు. నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు.

గోపీ సుందర్‌ స్వరాలు అందించారు. ఇందులోని తొలి నాలుగు పాటలను నిర్మాత నవీన్‌ ఎర్నేని, డైరెక్టర్లు పరశురామ్, బాబీ (కె.ఎస్‌.రవీంద్ర), సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను వెంకటేశ్‌ ఆవిష్కరించారు. పాటల సీడీని వెంకటేశ్‌ విడుదల చేసి నాగార్జునకు అందించారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘మజిలీ’ టీజర్‌లో ‘వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు’ అనే డైలాగ్‌ విన్నప్పుడు బాధ కలిగింది. తండ్రిగా నాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. కానీ, నేను చెప్పేది సినిమా చూడకముందు.  కానీ, సినిమా చూసిన తర్వాత మా మంచి అబ్బాయికి, మంచి అమ్మాయి దొరికిందనిపించింది.

ఏప్రిల్‌ 6న మాకు మంచి ఉగాది అవుతుంది. ‘మజిలీ’ ట్రైలర్‌ చూస్తుంటే రెండుసార్లు కన్నీళ్లొచ్చాయి. సినిమా ఇంకెంత బావుంటుందో’’ అన్నారు. వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘మజిలీ’ టీజర్‌ చూడగానే చాలా పెద్ద హిట్‌ అవుతుందనిపించింది. ట్రైలర్‌ చూడగానే చాలా చాలా పెద్ద పెద్ద హిట్‌ అవుతుందని అనుకున్నా. ‘సినిమా చూసిన తర్వాత అందరూ చైతూని కౌగలించుకుంటారని’ శివ నిర్వాణ అన్నాడు. నేను ట్రైలర్‌ చూడగానే కౌగలించుకుంటున్నాను. శ్యామ్, చైతూ, దివ్య చాలా బాగా చేశారు. ఏప్రిల్‌ 5న ఫ్యాన్స్‌ ఉగాది పండగను భారీగా చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాల్లో చైతూ, శ్యామ్‌ అద్భుతంగా నటిస్తారు’’ అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘శివగారు ఈ సినిమా గురించి అడగ్గానే నాకు ఓకే అనిపించింది. శ్యామ్‌.. నాకు ఇంకో హీరోయిన్‌ని ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు. నాన్న, వెంకీమామ నా పిల్లర్స్‌ ఆఫ్‌ స్ట్రెంగ్త్‌. శ్యామ్, నేను పెళ్లి తర్వాత ఇంత త్వరగా కలిసి సినిమా చేస్తామనుకోలేదు. నేను ఇప్పటిదాకా పనిచేసిన వాళ్లల్లో శివ హానెస్ట్‌ ఫిల్మ్‌ మేకర్‌. వ్యక్తిగా కూడా నిజాయతీపరుడు. తనతో చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. సాహు, హరీష్‌ చాలా మంచి నిర్మాతలు. నాకు, శ్యామ్‌కి ఇది ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌. ఈ సినిమాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. కామ్‌గా ఉన్నాం. ‘మజిలీ’ చూసి ఎవరూ అసంతృప్తికి లోనవరు’’ అన్నారు.

సమంత మాట్లాడుతూ– ‘‘నాగార్జున, వెంకటేశ్‌గార్ల వల్ల ఒక పాజిటివ్‌ నమ్మకం వచ్చింది. వాళ్ల  ప్రభావం మా మీద చాలా ఉంది. ప్రతి లవ్‌ స్టోరీ చాలా యూనిక్‌గా ఉంటుంది. ‘మజిలీ’ నిజమైన లవ్‌స్టోరీ. ‘ఏమాయ చేసావె, మనం’ తర్వాత ‘మజిలీ’ నాకు ఇంపార్టెంట్‌ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అందుకు శివగారికి ధన్యవాదాలు. మా ఆయన గురించి నేనే చెబితే బాగోదు. కానీ, ఏప్రిల్‌ 5 తర్వాత అందరూ చెబుతారు. నేను అది విని ఆనందిస్తాను’’ అన్నారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘నిన్ను కోరి’ చిత్రం తర్వాత జానర్‌ మారుద్దామనుకున్నా. అప్పుడు నాగచైతన్యగారు ఫోన్‌ చేసి ‘నీ సినిమా నచ్చింది. నీకు నచ్చిన కథ ఉంటే తీసుకురా చేద్దాం’ అన్నారు. ఆ సమయంలో నా దగ్గర కథ లేదు. 20 రోజుల తర్వాత వచ్చిన ఓ ఐడియాని చైతన్యగారి దగ్గరకు వెళ్లి చెప్పా. సినిమాని మార్కెట్‌ చేసుకోవాలని చైతన్య, సమంతని పెట్టలేదు. వాళ్ల నటనను గౌరవించి పెట్టా. సమంతగారితో ఎన్ని సినిమాలకు పని చేయడానికైనా నేను సిద్ధమే. అటు ఎలక్షన్, ఇటు ఐపీయల్‌ ఉన్నా అంతకుమించిన కిక్కు మా సినిమాలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు మా చైతన్యగారు, సమంతగారు అందించిన సపోర్టు మరువలేనిది. మా టీమ్‌ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. నిర్మాత హరీశ్, కథానాయిక దివ్యాంశ కౌశిక్, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు