నేను స్టార్‌ని కావడానికి అదో కారణం

8 Aug, 2019 02:18 IST|Sakshi
నాగార్జున

‘‘ఇతర భాషల్లో నా మార్కెట్‌ను పెంచుకోవాలనే ఆలోచన నాకూ ఉంది. కానీ నాకు ద్విభాషా చిత్రాలు కలిసి రాలేదు. నా కెరీర్‌లో నాలుగు ద్విభాషా చిత్రాలు చేశాను. సరైన ప్రేక్షకాదరణ లభించలేదు. ఈ విషయంలో నా పాఠాలు నేను నేర్చుకున్నాను. గీతాంజలి, శివ చిత్రాలను డబ్‌ చేశాం. బైలింగ్వల్‌గా తీయలేదు. ‘బాహుబలి’ కూడా తెలుగులోనే తీశారు. ఆ తర్వాత మిగతా భాషల్లోకి డబ్‌ చేసినా, మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అందరూ అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు’’ అని నాగార్జున అన్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించారు. నాగార్జున, పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు.

► ‘మన్మథుడు 2’ని చాలా కష్టపడి చేశాం. మేం పడిన కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించాలని కోరుకుంటున్నాను. అమ్మ, ముగ్గురు చెల్లెళ్లు, ఓ అమ్మాయి వల్ల బ్యాచిలర్‌ అయిన ఓ మధ్య వయస్కుడి జీవితం ఎలా ప్రభావితం అవుతుందన్నదే సినిమా కథ. ఈ సినిమా రొమాన్స్, ప్రేమ గురించి కాదు. పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. విజయనగరం నుంచి వెళ్లి పోర్చుగల్‌లో సెటిలైన ఓ కుటుంబానికి చెందిన ఫోర్త్‌ జనరేషన్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ కథ ఇది. వీళ్లు ఉండే ప్రాంతం పేరు కసాండ్ర అయితే ఆంధ్రా భోజనాలు, వంటకాలతో అది కాస్తా కసాంధ్రగా మారుతుంది (నవ్వుతూ).

► హీరోకి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ మాటను కాదనలేడు. అలాగని మనస్సాక్షిని వదులుకోలేడు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన హీరోది కాదు. వాళ్ల అమ్మది. అలా తప్పని పరిస్థితుల్లో డబుల్‌ లైఫ్‌ని లీడ్‌ చేయాల్సిన పరిస్థితి. ఆ సమయంలో ఓ కుర్ర అమ్మాయి హీరో జీవితంలోకి వస్తుంది? అప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి? అనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ట్రైలర్‌లో కొన్ని జోక్సే చూపించాం. సినిమా నిండా జోక్స్‌ ఉన్నాయి.

► రాహుల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చిలసౌ’ బాగా నచ్చింది. ఫ్రెంచ్‌ సినిమా బేస్‌ లైన్‌ తీసుకుని మన తెలుగు నేటివీటికి తగ్గట్లు మార్చాలని రాహుల్‌తో చెప్పాను. రాహుల్‌కి ఆర్టిస్టులతో పెర్ఫార్మ్‌ చేయించుకోవడం బాగా తెలుసు. ఏడాది ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ చేశాం. అంతా పర్‌ఫెక్ట్‌గా జరిగింది.

► సినిమా స్టార్టింగ్‌లో నాకూ, రకుల్‌కు ఏవో విభేదాలు వచ్చాయనే వార్తల్లో నిజం లేదు. రకుల్‌ మంచి నటి. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా తర్వాత లక్ష్మీగారు నాకు మళ్లీ తల్లిగా ఈ సినిమాలోనే నటించారు. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా సంగీతం నచ్చి ఈ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేతన్‌ భరద్వాజ్‌ను ఎంపిక చేశాం. సమంత, కీర్తీ సురేష్‌లవి ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలు.

► నిర్మాత పి. కిరణ్‌ నాకు చిన్ననాటి స్నేహితుడు. ఎప్పట్నుంచో మా కాంబినేషన్‌లో సినిమా అనుకుంటున్నాం. ఇప్పటికీ కుదిరింది. వయాకామ్‌వారు కూడా తెలుగులో సినిమాలు చేయాలనుకుంటున్నారు. వారు మా బ్యానర్‌తో అసోసియేట్‌ అవ్వడం హ్యాపీ. ‘మన్మథుడు 2’ ఆడితే ‘మన్మథుడు 3’ ఉండొచ్చు.

► సెన్సార్‌ వారు యూఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఏ క్యారెక్టర్‌ చెప్పిన పదాలను సెన్సార్‌వాళ్లు మ్యూట్‌ చేశారనేది సినిమాలో చూడండి. సినిమాలోని పాత్రలను బట్టి ఆ డైలాగులు వస్తాయి. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ అంత స్వచ్ఛమైన తెలుగు ఈ సినిమాలోనే వాడాం. ‘మన్మథుడు’తో పోల్చితే ఈ సినిమాలో రొమాన్స్‌ తక్కువ. అయినా నేటితరం పిల్లలకు ముద్దులు తెలియదు అనుకుంటే మన అమాయకత్వమే.

► కొత్త దర్శకులతో చేస్తే నాలోని కొత్తదనాన్ని వారు వెలికి తీస్తారు. యంగ్‌ టీమ్‌తో వర్క్‌ చేయడం నాకు ఫుల్‌ ఫన్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో గమనిస్తే ఎక్కువగా నేను అప్పటి తరం యంగ్‌ డైరెక్టర్స్‌తో చేసిన సినిమాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. నా మిగతా సినిమాల్లో కూడా సెకండ్‌ న్యూ డైరెక్టర్‌ లేదా బ్రాండ్‌ న్యూ డైరెక్టర్స్‌ ఉంటారు. బహుశా... నేను స్టార్‌ని కావడానికి ఇదొక కారణం కావొచ్చు.

► సీరియస్‌ సినిమాలు నాకు అంతగా నచ్చవు. సినిమాలోని క్యారెక్టర్స్‌ నవ్వించేలా లేదా స్ఫూర్తి పొందేలా ఉండాలనుకుంటాను. ఒకవేళ మనం ఏడిస్తే సంతోషంగా ఏడ్వాలి. డిప్రెషన్‌తో కాదు. కొన్ని సీరియస్‌ పాత్రలు  చేశాను. వాటిలో కొన్నింటి  నుంచి నా తప్పులు నేను తెలుసుకున్నాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. సినిమా సక్సెస్‌ ఒక్కరిదే కాదు. టీమ్‌ అందరిదీ. అయితే దురదృష్టవశాత్తు సక్సెస్‌ క్రెడిట్‌ను హీరో, దర్శకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త కొత్త కథలు వస్తున్నాయి. సీనియర్‌ హీరోలకు కథల కొరత ఉంది. మంచి కథను పట్టుకోవడం కోసం కష్టపడతాం.

► ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ షోలో లైఫ్‌ స్టోరీస్‌ విన్నాను. కానీ బిగ్‌బాస్‌ షోలో వారానికి వారం మారిపోతున్నారు. డిఫరెంట్‌గా ఉంటున్నారు. షో పాపులారిటీ కూడా పెరిగిపోతోంది. ఇదో డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఒకే హౌస్‌లో అయితే నేను ఎక్కువగా ఉండను. ఈ షోకు మంచి వ్యూయర్‌షిప్‌ రావడం హ్యాపీ. ఈ ఏడాది నా బర్త్‌డే (ఆగస్టు 29)కి స్పెషల్‌ ప్లాన్స్‌ ఏమీ లేవు. నా ఫ్యామిలీతో ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నాను (సరదాగా). వాళ్లతో కొంచెం టైమ్‌ గడపాలని ఉంది.

ధనుష్‌తో నేను చేయాల్సిన సినిమా క్యాన్సిల్‌ అయింది. బాలీవుడ్‌లో నేను చేస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా మంచి ఎగై్జటింగ్‌ ప్రాజెక్ట్‌. నా వంతు షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. బాగా గ్రాఫిక్స్‌ ఉన్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్‌ స్టార్ట్‌ చేయాల్సి ఉంది.

మరిన్ని వార్తలు