అక్కినేని నాగార్జున జన్మదినం!

29 Aug, 2013 12:22 IST|Sakshi
అక్కినేని నాగార్జున జన్మదినం!
టాలీవుడ్ రంగంలోనే కాక, దక్షిణాది, బాలీవుడ్ లో కూడా అక్కినేని నాగార్జున అంటే ఓ క్రేజ్. నాగార్జున ఓ నటుడిగా సంతృప్తి చెందకుండా, వివిధ రంగాల్లో ప్రవేశించి విజయం సాధిస్తున్నారు. సినిమా రంగంలో విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ, యువ హీరోలకు ధీటుగా పోటినిస్తూ, కెరీర్ ను జాగ్రత్త ప్లాన్ చేసుకుంటూనే వివిధ వ్యాపార రంగాల్లో ప్రవేశించి బిజీగా లైఫ్ గడుపుతున్నారు. అందుకే నాగార్జునను  ఓ ప్రయోగశాల అంటారు. నటుడిగా, నిర్మాతగా ఆయన విజన్ ప్రత్యేకమైనది కాబట్టే పలు వ్యాపార రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నన్నారు. 
 
టెలివిజన్ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని, వ్యాణిజ్య ప్రకటనల్లో పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించారు. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో జతకట్టి 'మహీ రేసింగ్' జట్టుకు సహ భాగస్వామిగా చేరాడు. అంతేకాక ఇటీవలే ప్రారంభమైన ఇండియన్ బాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ జట్టును భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ లతో కలిసి సొంతం చేసుకున్నారు. 
 
అటు మీడియా, క్రీడ, ఇతర వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినం ఆగస్టు 29. ఆయన మరిన్ని జన్మదినోత్సవాలను జరుపుకుంటూ, అనేక  విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తూ... అభిమానులతోపాటు మనం కూడా జన్మదినం రోజున నాగార్జునకు శుభాకాంక్షలు అందచేద్దాం!