-

నిజజీవిత కథానాయకుడు

20 Sep, 2015 00:21 IST|Sakshi
నిజజీవిత కథానాయకుడు

నేడు అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి
 దేవదాసు ఎలా ఉంటాడు? విప్రనారాయణ ఎలా ప్రవర్తిస్తాడు? కవి కాళిదాసు, భక్త జయదేవుడు ఎలా ఉండి ఉంటారు? మరి, దసరా బుల్లోడంటే? భగ్న ప్రేమి కుడి నుంచి భాగవతోత్తముడి దాకా, కవీశ్వరుడి నుంచి కుటుంబ కథల కథా నాయకుడి దాకా - ఏ పాత్రకైనా రోల్ మోడల్‌గా నిలవడం ఎంతటి నటుడికైనా సవాలు. కానీ, కష్టపడి పైకొచ్చి, ఆ సవాలును ఇష్టపూర్తిగా స్వీకరించి, అభినయమే శ్వాసగా బతికిన నటుడంటే అక్కినేని నాగేశ్వరరావు(1924 - 2014).
 
 పెద్దగా చదువైనా లేని పల్లెటూరి పిల్లగాడు... పెద్దయ్యాక కూడా నాటకాల్లో ఆడవేషాలు వేసిన ఒక కుర్రాడు... పెద్దమనుషుల్ని పరిచయం చేస్తే కనీసం నమస్కరించి మాట్లాడడం కూడా తెలియని శుద్ధ బుద్ధావతారం... నేర్చుకొనే గుణం ఉంటే ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడవచ్చనీ, సాధన చేస్తే కొన్ని కోట్ల మందిని ఆకట్టుకొనే కథానాయకుడు కావచ్చనీ, ఒక జాతి తరతరాలూ చెప్పుకొనే కల్చరల్ ఐకాన్‌గా చిరకాలం మిగిలిపోవచ్చనీ నిరూపించడం అక్కినేని జీవిత కాలంలో చేసి చూపెట్టిన అపూర్వ సాధన. అనారోగ్యం రావచ్చు... ఒకటికి రెండు గుండె ఆపరేషన్లు జరగచ్చు... జీవితంలో, కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు ఎదురుకావచ్చు.
 
 కానీ, ‘బతుకు కన్నీటి ధారలలో బలి చేయకు’ అన్న పాఠాన్ని ఎలా చెప్పాలి? అవన్నీ ఎదురై నప్పుడు అక్షరాలా ఆచరించి చూపడం తప్ప! అక్కినేని చేసింది అదే! ఆఖరి క్షణంలో క్యాన్సర్ కబళిస్తున్నప్పుడు కూడా అదే ధైర్యం... అదే హుందాతనం. చేస్తున్న వృత్తినే దైవంగా భావించడం, ఆ భావనతోనే ఆఖరు దాకా జీవించడం... చాలా మంది చెబుతారు. కానీ, అక్కినేని చేసి చూపించారు. ‘నటుడిగానే మరణించాలి. మరణించాక కూడా జీవించాలి’- ఇది కొందరికి ఆశ.
 
 ఇంకొందరికి తీరని ఆశయం. మరికొందరికి కేవలం జనం మెచ్చడానికిచ్చే స్టేట్‌మెంట్. కానీ, చిన్ననాటే రంగస్థలంపై మొదలుపెట్టి, వెండితెరపై ‘ధర్మపత్ని’ (1941) నుంచి చనిపోయే ముందు ‘మనం’ (2014) దాకా ఏడున్నర దశాబ్దాల పైగా వృత్తినే శ్వాసించడం ఏయన్నార్ ఘనత. జీవితంలో నటించడం ఎక్కువై, నటనలో జీవించడం తక్కువైన రోజుల్లో అక్కినేని జీవితకాలపు జ్ఞాపకాల్ని జనం గుండెల్లో మిగిల్చిన మహానటుడు. అందుకే, భారతీయ సినీచరిత్రలో ఏయన్నార్ కథ చిరకాలపు పాఠం. అచ్చతెలుగు జీవితం, పంచెకట్టు వేషమంటే ఇప్పటికీ గుర్తొచ్చే ఆయన అమరజీవి... తెలుగు సమాజపు సమష్టి చేతనలో సదా చిరంజీవి.