విద్య కోసం పోరాటం

21 Jun, 2019 00:26 IST|Sakshi
నందితాశ్వేత

కథానాయిక నందితాశ్వేత ప్రధాన పాత్రలో బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘అక్షర’. అహితేజ బెల్లంకొండ, సురేష్‌ వర్మ నిర్మించారు. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం ఆసక్తిగా సాగుతుంది అని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఒక దర్శకుడి ఆలోచన విఫలం కావొచ్చు. కానీ అతని ప్రయత్నం ఎప్పటికీ విఫలం కాకూడదు. ఈ సినిమా కథ బాగా నచ్చింది. టీజర్‌ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నిర్మాతలకు అభినందనలు. చిన్నికృష్ణ నాకు మంచి మిత్రుడు. నా మొదటి సినిమా ‘పటాస్‌’ టేకాఫ్‌ కావడానికి అతను చేసిన సహాయం మరువలేనిది. నందితా శ్వేత మంచి ఆర్టిస్టు.

ఈ సినిమాలో ఆమె లుక్స్‌ బాగున్నాయి’’ అన్నారు. ‘‘నేను చెప్పిన లైన్‌ విని దర్శకుడిగా నాకు అవకాశం కల్పించిన నిర్మాతలకు థ్యాంక్స్‌. ఈ చిత్రంలో ఓ సీరియస్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం. ఈ సినిమాలోని ‘అక్షర’ పాత్రకు రూపం ఇచ్చిన నందితగారికి థ్యాంక్స్‌. ఈ కథ వినగానే ‘హిట్‌ కొడుతున్నావ్‌’ అని అనిల్‌ అన్నాడు. ఎడ్యుకేషన్‌ అందరికీ అందుబాటులోకి రావాలన్నదే అక్షర చేసే పోరాటం’’ అని చిన్నికృష్ణ అన్నారు. ‘‘మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ ఇది. ఈ సినిమాకు నా కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు నందిత. ‘‘సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు సురేష్‌ వర్మ.‘‘అక్షర’ సినిమా ఐడియా నాకు పేపర్‌ మీద ఉన్నప్పటి నుంచి తెలుసు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నారు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్‌. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్‌ చేశానని శ్రీతేజ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు