‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

9 Sep, 2019 14:54 IST|Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు. సోమవారం(ఆగష్టు 9) అక్కీ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త మూవీ విశేషాలను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. చంద్రశేఖర్‌ ద్వివేది దర్శకత్వంతో తెరకెక్కుతున్న ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపాడు. ‘ నా పుట్టిన రోజున నా మొదటి చారిత్రాత్మక చిత్రమైన  సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ గురించి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది! నా పెద్ద చిత్రాల్లో ఇది ఒకటి’  అంటూ ట్వీట్‌  చేశాడు. అలాగే ఈ సినిమా గురించి అక్షయ్‌ మాట్లాడుతూ.. "భారతదేశంలోని అత్యంత నిర్భయమైన, ధైర్యవంతమైన రాజులలో ఒకరైన పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో నటించడం నిజంగా నాకు దక్కిన అరుదైన గౌరవం. ‘భారతదేశ ప్రజల సంస్కృతి, విలువల ప్రచారం కోసం పోరాడిన నిజమైన హీరోల అమరత్వాన్ని దేశం ఎన్నటికి మరిచిపోదు’ అని అన్నారు.

కాగా క్రీ. శ. 1192 సంవత్సరంలో మహమ్మద్‌ ఘోరి సైన్యం భారతదేశంపై దాడికి ప్రయత్నించగా, వారికి ఎదురు నిలిచి పోరాడిన.. చాహమన రాజ వంశస్థుడైన పృథ్వీరాజ్‌ చౌహన్‌ రాజు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’.  నిజమైన హీరో  ధైర్యాన్ని, అతని కీర్తిని తెరపైకి తీసుకువచ్చే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఖిలాడి తెలిపాడు.ఈ క్రమంలో అభిమానులు, మిషన్‌ మంగళ్‌ దర్శకుడు జగన్ శక్తిలు ట్విటర్ వేదికగా అక్షయ్‌కు విషెస్‌ తెలిపారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు