ఇప్పుడు కత్రినాతో వాన పాట

21 Jun, 2019 06:05 IST|Sakshi
అక్షయ్‌ కుమార్‌

పాపులర్‌ అయిన పాత పాటలన్నీ కొత్త సినిమాల కోసం రీమిక్స్‌ చేసే ట్రెండ్‌ తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య హిందీలో ఈ రీమిక్స్‌ లెక్క పెరిగింది. గత ఏడాది రీమిక్స్‌ సాంగ్స్‌ ‘దిల్‌బర్‌ దిల్‌బర్‌...’ (సత్యమేవ జయతే), ‘ఆంఖ్‌ మారే..’ (సింబా) విన్నాం. తాజాగా అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ రీమిక్స్‌ సాంగ్‌కు స్టెప్‌ వేయనున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ‘సూర్యవన్షీ’ అనే పోలీస్‌ స్టోరీ చేస్తున్నారు అక్షయ్‌. కత్రినా కైఫ్‌ కథానాయిక.

‘మోహ్రా’ సినిమాలోని అక్షయ్, రవీనా టాండన్‌ పాడుకున్న వాన పాట ‘టిప్‌ టిప్‌ బర్సా పానీ...’ ఎంత పాపులరో తెలిసిందే. చెప్పాలంటే ‘మోహ్రా’ సినిమాలో ప్రతీ పాట బ్లాక్‌బస్టరే. ‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌ మస్త్‌..’, ‘నా కజ్రే కా దర్‌’ పాటలు ఆ సినిమాలోవే. ఇక అక్షయ్, కత్రినా కాలు కదపనున్న ‘టిప్‌ టిప్‌ బర్సా పానీ..’ పాటకు ఫర్హాఖాన్‌ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఒకప్పుడు తాను డ్యాన్స్‌ చేసిన పాటను మళ్లీ తన సినిమాలోనే రీమిక్స్‌ చేయడం పట్ల అక్షయ్‌ స్పందిస్తూ – ‘‘ఈ పాటను వేరే ఏ యాక్టర్‌ రీమిక్స్‌ చేసినా కచ్చితంగా నిరుత్సాహపడేవాణ్ణి. ఎందుకంటే నాకు, నా కెరీర్‌కు ఈ పాట చాలా స్పెషల్‌’’ అన్నారు. ‘సూర్యవన్షీ’ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు