‘నా పౌరసత్వంపై రాద్ధాంతం అవసరమా?’

3 May, 2019 18:29 IST|Sakshi

ముంబై :  కెనడా పౌరసత్వం విషయంలో వస్తున్న విమర్శలపై బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ట్విటర్‌లో మండిపడ్డారు. 'నా పౌరసత్వంపై అనవసరమైన ఆసక్తి ఎందుకో నిజంగా అర్థం కావడం లేదు. నాకు కెనడా పాస్‌పోర్టు ఉన్న విషయాన్ని నేను ఏరోజు దాచిపెట్టలేదనేది ఎంత నిజమే, గత ఏడేళ్లలో నేను కెనడా వెళ్లలేదు అనేది కూడా అంతే నిజం. భారత దేశంలోనే పని చేస్తున్నా, అన్ని రకాల పన్నులను ఇక్కడే కడుతున్నా. ఇన్నేళ్లలో భారతదేశంపై నాకున్న ప్రేమను ఎవరి దగ్గరా నిరూపించుకోవాల్సిన అవసరం రాలేదు. నా పౌరసత్వం విషయంలో తరచూ అనవసరమైన రాద్ధాంతం చేయడం నన్ను బాధించింది. అయినా ఎప్పటిలానే ఉడతా భక్తిగా దేశాన్ని బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తా' అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు.

కేసరి, టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథా, ఎయిర్‌లిఫ్ట్‌ వంటి దేశభక్తి మేళవించిన కథలతో వరుసగా సూపర్‌హిట్లు కొడుతున్న అక్షయ్‌కుమార్‌ తాజాగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలంటూ ట్విటర్‌లో విజ్ఞప్తి చేస్తూ.. ట్యాగ్‌ చేసిన ప్రముఖుల్లో అక్షయ్‌కుమార్‌ కూడా ఉన్నారు. అంతేకాకుండా మోదీ ట్వీట్‌కు బదులిస్తూ.. ఓటు ఎంతో శక్తిమంతమైనదని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముందని అక్షయ్‌ చెప్పుకొచ్చారు. తీరా ఓటు వేయని ఆయన అదేరోజు ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని.. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఓటు ఎందుకు వేయలేదని మీడియా ప్రశ్నించగా చెలియే.. చెలియే.. (వదిలేయండి) అంటూ దాటవేయడంతో అక్షయ్‌ పౌరసత్వంపై కూడా సామాజిక మాద్యమాల్లో తీవ్ర చర్చ జరిగింది.

>
మరిన్ని వార్తలు