సూపర్‌ కుమార్‌

6 Jun, 2020 00:19 IST|Sakshi
అక్షయ్‌ కుమార్‌

వార్షికాదాయం రూ. 366 కోట్లు

గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మే వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన ఉన్న ‘టాప్‌ 100’లో అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు. మన దేశం నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఒకే ఒక్క సెలబ్రిటీ అక్షయ్‌ కావడం విశేషం. నిజానికి గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అక్షయ్‌ సంపాదన దాదాపు 130 కోట్లు తగ్గింది. 2018 జూన్‌ నుంచి 2019 మే వరకు అక్షయ్‌ సంపాదన రూ. 490 కోట్లు. 2019 జూన్‌ నుంచి 2020 మే వరకూ ఆయన సంపాదన రూ. 366 కోట్లు. ఈ లెక్కను ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ విడుదల చేసింది. గత ఏడాది ఈ పత్రిక విడుదల చేసిన ‘టాప్‌ 100’ సంపాదనపరులలో అక్షయ్‌ది 33వ స్థానం అయితే ఈ ఏడాది 52వ స్థానంలో నిలిచారు. హిందీ అగ్రహీరోల్లో ఒకరైన అక్షయ్‌ ఎక్కువ సంపాదించడానికి కారణం ఏడాదికి మినిమమ్‌ మూడు నాలుగు సినిమాలు చేయడమే.

దాంతో పాటు వాణిజ్య ప్రకటనలు ఎలానూ ఉంటాయి. ఇక ఈ ఏడాది కరోనా కారణంగా సినిమాలన్నీ ఆగిపోయిన నేపథ్యంలో అక్షయ్‌ సంపాదన తగ్గింది. అయితే అక్షయ్‌ సంపాదించిన 366 కోట్లలో ‘ది ఎండ్‌’ వెబ్‌ సిరీస్‌ పారితోషికం 75 కోట్లు అని ఫోర్బ్స్‌ పేర్కొంది. అది మాత్రమే కాదు... కరోనా సేవా కార్యక్రమాలకు అత్యధిక విరాళం ఇచ్చిన భారతీయ ప్రముఖులలో ఒక వ్యక్తి అక్షయ్‌ అని కూడా కొనియాడింది. అక్షయ్‌ దాదాపు 35 కోట్లు విరాళంగా ఇచ్చారు. అందుకే ఈ మధ్య చాలామంది ఆయన్ను ‘సూపర్‌ కుమార్‌’ అన్నారు. ఇప్పుడు ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ విడుదల చేసిన ‘టాప్‌ 100’లో స్థానం సాధించిన ఒకే ఒక్క భారతీయుడు అక్షయ్‌ కాబట్టి మరోసారి ‘సూపర్‌ కుమార్‌’ అని అభినందించాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు