అక్షయ్ కుమార్ సంచలన వీడియో

7 Oct, 2016 11:27 IST|Sakshi
అక్షయ్ కుమార్ సంచలన వీడియో

ఉడీలో ఉగ్రదాడి జరిగి.. 19 మంది సైనికులు మరణించినప్పటి నుంచి భారతీయుల రక్తం ఉడికిపోతోంది. సర్జికల్ స్ట్రైక్స్‌తో ఆ కోపం కొంతవరకు చల్లారింది. అయితే.. ఈలోపు పాక్ నటీనటులను నిషేధించడం, దానిమీద ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేయడంతో దీనిపై పెద్ద చర్చే జరిగింది. తాజాగా అంశంపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించాడు. పలు సినిమాల్లో సైనికుడి పాత్రలు, పోలీసు పాత్రలు పోషించిన అక్షయ్ కుమార్.. నిజ జీవితంలో ఒక సైనికాధికారి కొడుకు. అందుకే ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన అతడు.. తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో అక్షయ్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి...

''ఈరోజు నేను సెలబ్రిటీలా మాట్లాడటం లేదు. ఒక సైనికుడి కొడుకుగా మాట్లాడుతున్నా. మన దేశవాసులే ఒకరితో ఒకరు వాదించుకుంటున్న విషయాన్ని కొంత కాలంగా టీవీ వార్తలు, వార్తాపత్రికలలో చూస్తున్నా. కొంతమంది సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు కావాలంటున్నారు. మరికొందరు కళాకారులను నిషేధించాలంటున్నారు. మరికొందరు అసలు యుద్ధం జరుగుతుందా లేదా అని భయపడుతున్నారు. మీ వాదనలన్నీ తర్వాత చేసుకోండి. ముందు.. సరిహద్దుల్లో మీకోసం ప్రాణాలు వదులుతున్న జవాన్ల గురించి ఆలోచించండి. ఉడీ ఉగ్రదాడులలో 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. 24 ఏళ్ల నితిన్ కుమార్ బారాముల్లాలో ప్రాణత్యాగం చేశాడు. ఒక సినిమా విడుదల అవుతుందా లేదా.. ఒక కళాకారుడిపై నిషేధం ఉంటుందా లేదా అని వాళ్ల కుటుంబాలు ఏమైనా బాధపడుతున్నాయా? వాళ్ల ఆందోళన అంతా ఒక్కటే.. తమ భవిష్యత్తు ఏంటని. మనమంతా కూడా దాని గురించి ఆలోచించాలి. వాళ్ల భవిష్యత్తు భద్రంగా ఉండేలా చూడాలి. వాళ్లు మనల్ని కాపాడుతున్నారు కాబట్టే ఇక్కడ మీరు, నేను అంతా బతికి ఉన్నాం. వాళ్లు కాపాడకపోతేప.. హిందూస్థాన్ అనే దేశమే ఉండదు... జై హింద్'' అని ఆ వీడియోలో అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు.