అందరం సమానమే.. ఈ తేడాలేందుకు

3 Aug, 2019 14:42 IST|Sakshi

మహిళలకు సంబంధించిన ఏ అంశాల గురించి మాట్లాడాలన్నా, చర్చించాలన్నా ముందుంటారు హీరో అక్షయ్‌ కుమార్‌. ఈ క్రమంలోనే పాడ్‌మ్యాన్‌, టాయ్‌లెట్‌ వంటి సినిమాలు చేశారు అక్షయ్‌. ప్రస్తుతం ఈ ఖిలాడీ హీరో ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) మార్స్‌ మిషన్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తల గురించి హిందీలో రూపొందుతున్న సినిమా ‘మిషన్‌ మంగళ్‌’.

విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, కీర్తి కుల్హారీ, నిత్యా మీనన్‌ ఈ మహిళా శాస్త్రవేత్తల పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషనల్‌ కార్యక్రమంలో అక్షయ్‌ మాట్లాడుతూ.. ‘మిషన్‌ మంగళ్‌ చిత్రాన్ని ఉమెన్‌ ఓరియెంటెడ్ సినిమా అంటే నాకు చాలా కోపం వస్తుంది. మనందరం సమానం అయినప్పుడు మేల్‌ ఓరియెంటెడ్‌, ఉమెన్‌ ఓరియెంటెడ్‌ అనే పేర్లు ఎందుకు. ఇది ఓ సినిమా అంతే. దాన్ని అలానే చూడాలి’ అన్నారు అక్షయ్‌.

‘ఇంటిని నడిపేది మహిళ. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఓ మహిళ చేతిలోనే ఉంది. రోజులు గడుస్తున్న కొద్ది మహిళలకు అన్నిరంగాల్లో సమ ప్రాధాన్యం లభిస్తుంది. మరి అలాంటప్పుడు సినిమాల్లో మాత్రం.. మేల్‌ ఓరియెంటెడ్‌, ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ అనే తేడాలు ఎందుకు’ అన్నారు అక్షయ్‌. పిల్లల్ని శాస్త్రవేత్తలుగా ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అన్నారు అక్షయ్‌. సైంటిస్ట్‌ అనేది కూడా ఓ  ప్రొఫెషనే. చంద్రయాన్‌ ప్రయోగం తర్వాత జనాలు.. ఈ రంగం వైపు అధిక ఆసక్తి చూపుతున్నారు అన్నాడు అక్షయ్‌

>
మరిన్ని వార్తలు