వీర నారి!

17 Feb, 2019 00:02 IST|Sakshi

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’లాంటి రొమాంటిక్‌ కామెడీ–డ్రామాలో  ఫ్యాషన్‌ ఎడిక్ట్‌ శనయగా మెరిసినా, ‘రాజీ’లాంటి స్పై థ్రిల్లర్‌లో  క్విక్‌ లెర్నర్‌ సెహ్మత్‌ఖాన్‌గాఅలరించినా...నటనలో తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటుంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌. ఈ అమ్మడు త్వరలో మన తెలుగు సినిమాలో నటించనుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ‘ప్రతి సినిమా ఏదో ఒక పాఠం నేర్పుతుంది’ అంటున్న ఆలియా అంతరంగ తరంగాలు ఇవి...

కొత్త కొత్తగా...
నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలేగానీ ప్రతి సినిమా, ప్రతి పాత్ర ఏదో కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది. ‘ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను’ అని ఎవరూ అనుకోరు. నేను కూడా అంతే. కొత్త కొత్త పాత్రలు చేయాలనుకుంటున్నాను. బయోపిక్, యాక్షన్, సైన్స్‌–ఫిక్షన్‌ సినిమాలు చేయాలని ఉంది.

ఇలా కూడా...
ప్రతి సినిమాను ‘ఇదే నా మొదటి’ సినిమా అన్నట్లుగా చేస్తాను. అప్పుడే జోష్‌ వస్తుంది. ఒక క్యారెక్టర్‌ కోసం ప్రిపరేషన్‌ అవసరమేగానీ అదీ లేకుండా కూడా బాగానే ఉంటుంది. సహజంగా ఉంటుంది. నా విషయానికి వస్తే షైనింగ్‌ డైమండ్‌లా తెరపై కనిపించాలనుకోవడం లేదు.


పర్సనల్‌ హ్యాంగోవర్‌
సినిమాల్లో చేసే క్యారెక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లే అలవాటు నాకు లేదు. అయితే కొన్నిసార్లు తప్పకపోవచ్చు. ‘హైవే’ సినిమాలో నేను చేసిన ‘వీర’ పాత్ర అలాంటిదే. అందులో లోతుగా లీనమైపోయాను. ఒక దశలోనైతే...‘కొండ ప్రాంతాల్లోకి వెళ్లాలని ఉంది, అక్కడే నివసించాలని ఉంది’...అంటూ నాన్నతో సీరియస్‌గా ఛాట్‌ చేసేదాన్ని. అది ఆల్కహాలిక్‌ హ్యాంగోవర్‌ కాదు. పర్సనల్‌ హ్యాంగోవర్‌. వీర హ్యాంగోవర్‌.

బ్రేక్‌
‘బ్రేక్‌ లేకుండా ఏడాది పొడుగునా పనిచేస్తాను’ అనే మాట వింటుంటాం.కానీ నేను మాత్రం  ఈ రకం కాదు. ఏడాదిలో కనీసం రెండు బ్రేక్‌లైనా ఉండాల్సిందే. బ్రేక్‌లో ప్రయాణాలు చేస్తాను. జీవితాన్ని ఆస్వాదిస్తాను. అందుకే ఈ బ్రేక్‌ను ‘విశ్రాంతి’ అనుకోను. జీవితాన్ని ఆస్వాదించడానికి ఒక అవసరం, అనుభవం అనుకుంటాను. ఆ అనుభవం వృథా పోదు. జీవితంలో లేదా సినిమాల్లో ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు