హస్తినలో నెల రోజులు

29 Mar, 2019 00:48 IST|Sakshi

నెల రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. మరి... అక్కడి నుంచి కెమెరాలో ఏం బంధించి తీసుకొస్తారు? అనే విషయాలను మాత్రం వెండితెరపై చూస్తేనే అసలు మజా. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన విదేశీ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్, రామ్‌చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగన్, తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ వచ్చే వారం ఢిల్లీలో మొదలు కానున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ఆలియా, ఎడ్గర్‌ జోన్స్‌ కూడా పాల్గొంటారు. రియల్‌ లొకేషన్స్‌లో సీన్స్‌ను ప్లాన్‌ చేశారు. నెల రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను తీస్తారు. ఇక తన వందో చిత్రం ‘తన్హాజీ: ది అన్‌ సంగ్‌ వారియర్‌’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చాక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ కోసం అజయ్‌ దేవగన్‌ ఈ సెట్‌లో జాయిన్‌ అవుతారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2020 జూలై 30న రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు