నాలుగేళ్లు... 24 సినిమాలు... అన్నీ వెరైటీనే!

28 Nov, 2016 23:04 IST|Sakshi
నాలుగేళ్లు... 24 సినిమాలు... అన్నీ వెరైటీనే!

తమ్మారెడ్డి భరద్వాజ

‘‘విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా’ చిత్రాన్ని నేను, సురేశ్ కొండేటి తెలుగులో విడుదల చేసి హిట్ సాధించాం. చేసే ప్రతి చిత్రంలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని విజయ్ సేతుపతి కోరుకుంటాడు.. లేకపోతేతను చేయడు.  నాలుగేళ్లలో 24 వైవిధ్యచిత్రాలు చేయడం గ్రేట్’’ అని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకొడి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘పురియాద పుదిర్’ చిత్రాన్ని లత సమర్పణలో ‘పిజ్జా 2’ పేరుతో డి.వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

శామ్ సి.ఎస్ స్వరాలు అందించగా, తెలుగులో ‘మంత్ర’ ఆనంద్ సంగీత పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం పాటల సీడీని తమ్మారెడ్డి రిలీజ్ చేసి నిర్మాత బెల్లంకొండ సురేశ్‌కు ఇచ్చారు. డి. వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ఆధునిక టెక్నాలజీని వాడుకొని కొందరు సమాజంలోని అమాయక మహిళలను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? అనే అంశంతో థ్రిల్లర్‌గా నిర్మించిన చిత్రమిది. తెలుగు, తమిళాల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం’’ అన్నారు. రంజిత్ జయకొడి, గాయత్రి, నిర్మాతలు సుదర్శన్ రెడ్డి, మల్కాపురం శివకుమార్, శోభారాణి పాల్గొన్నారు.