అందుకే సీరియస్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను 

30 Jun, 2020 00:44 IST|Sakshi

‘‘ఈ పుట్టినరోజుకి  ప్రత్యేకత ఏంటంటే కరోనా స్పెషల్‌ (నవ్వుతూ). కరోనా వల్ల బయట పరిస్థితులు బాగాలేవు. మా అన్నయ్య (ఆర్యన్‌ రాజేష్‌), వదిన, వారి పిల్లలు, నేను, నా శ్రీమతి విరూప, నా కూతురు అయానా ఇవికా అందరం కలిసి ఇంట్లోనే ఉన్నాం. ఈ లాక్‌డౌన్‌లో మా ప్రపంచమంతా పిల్లలతోనే గడచిపోతోంది’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. నరేశ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు. 

► ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి?
నేను నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాను ఏప్రిల్‌లో, ‘నాంది’ చిత్రాన్ని మేలో విడుదల చేద్దామనుకున్నాం. కానీ కరోనా వల్ల థియేటర్స్‌ మూతబడ్డాయి. కొత్తగా రెండు సినిమాలు కమిట్‌ అయ్యాను. షూటింగ్స్‌ విషయానికొస్తే.. హైదరాబాద్, చెన్నై, ముంబయ్‌లలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో నటీనటులు ధైర్యంగా షూటింగ్‌లకు వచ్చే పరిస్థితి లేదు. కరోనా తగ్గేవరకూ పరిస్థితి ఇంతే. నిర్మాతలు కూడా ఎక్కువ రిస్క్‌ తీసుకోలేరు కదా.

► పుట్టినరోజుకి సేవా కార్యక్రమాలు చేస్తుంటారా? 
నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) జయంతికి, నా పాప పుట్టినరోజున అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోనో లేకుంటే బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద ఉండే రోగులు, వారి సహాయకులకు అన్నదానం చేయిస్తుంటాను.

► నాన్న లేని లోటు ఎలా అనిపిస్తోంది?
జూన్‌ 10న నాన్నగారి జయంతి. 2011 జనవరి 21న నాన్న క్యాన్సర్‌ వ్యాధితో చనిపోయారు. అన్నయ్య నిశ్చితార్థానికి నెల ముందు మాకు దూరమయ్యారాయన. 2012లో అన్నయ్య, 2015లో నా పెళ్లి జరిగింది. మా వివాహాలను ఆయన చూడలేదు.. మనవడు, మనవరాళ్లతో ఆడుకోలేదు. జీవితమంతా కష్టపడ్డారు.. సుఖపడాల్సిన వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. మా పిల్లల అల్లరి చూసినప్పుడల్లా ‘వాళ్లకి తాతయ్య ఉండుంటే బాగుండేది’ అనిపిస్తుంది.

నాన్నగారుంటే ఓ ధైర్యం.. మంచీ చెడూ చెప్పేవారు. మా కుటుంబానికి మర్రిచెట్టులాంటివారు. చాలా మందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. నాన్నలేని లోటు మాత్రం ఎప్పుడూ తీరదు. నాన్న చనిపోయిన రెండేళ్లకు సరిగ్గా 2013 జనవరి 21న మా బాబాయ్‌ ఈవీవీ గిరిగారు కూడా చనిపోయారు. ఇద్దరి కొడుకుల్ని కోల్పోయిన మా నానమ్మ, తాతయ్యల బాధ వర్ణణాతీతం. నాన్న, బాబాయ్‌ చనిపోయిన రోజు జనవరి 21వ తేదీ అంటే భయపడుతుంటాం. ఆ రోజు ఎవరూ బయటికి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాం.

► ఈ మధ్య ట్రాక్‌ మార్చినట్టున్నారు.. వరుసగా సీరియస్‌ పాత్రలు చేస్తున్నట్టున్నారే? 
నేను ఇండస్ట్రీకి వచ్చి 18ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లయినా కామెడీ రూట్‌ మార్చలేదని ప్రేక్షకులు అనుకుంటుంటారు. అందుకే ‘గమ్యం, ప్రాణం, నేను, శంభో శివ శంభో, మహర్షి’, ఇప్పుడు ‘నాంది’ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశాను. నటుడిగా నేను నిరూపించుకోవాలి, బాగా పేరు రావాలంటే కథాబలం ఉన్న ఇలాంటి పాత్రలే చేయాలి. అయితే.. నాకు ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చింది కామెడీనే. అది చేస్తూనే మధ్యలో కథా బలం ఉన్న సినిమాలు చేస్తుంటాను. ‘నాంది’ చిత్రం నా కెరీర్‌కి బ్రేక్‌ అవుతుంది. ఇందులో నగ్నంగా నటించాను.. ఆ పోస్టర్స్‌ చూసి నా ధైర్యానికి చాలా మంది మెచ్చుకున్నారు.

► ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మీ అభిప్రాయం? 
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అన్నది కొత్త ప్రతిభావంతులకు వరం. సినిమాలను పెద్ద తెరపై చూసేందుకు ప్రేక్షకులు అలవాటుపడ్డారు. ఓటీటీ ఉంది కదా అని సెల్‌ఫోన్‌ లాంటి చిన్న స్క్రీన్‌లో ఎన్ని సినిమాలు చూస్తారు చెప్పండి? థియేటర్స్‌లో చూసే అనుభూతే వేరు.

► వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన ఉందా? 
సినిమాలతో బిజీగానే ఉన్నా. వెబ్‌ సిరీస్‌లపై ఆసక్తి లేదు. పైగా వెబ్‌ సిరీస్‌లు సిటీ జనాలకే పరిమితం. గ్రామాలకు ఇంకా విస్తరించలేదు. గ్రామాలకు విస్తరించేందుకు ఇంకా రెండు మూడేళ్లు పడుతుంది. అప్పుడే ఎక్కువ మంది చూస్తారు.

► ఈవీవీ సినిమా బ్యానర్‌లో కొత్త సినిమాలేవైనా ప్లాన్‌ చేస్తున్నారా? 
మా బ్యానర్‌లో సినిమా అంటే నాన్నగారి సినిమాలా ఉండాలనే అంచనాలుంటాయి. కథలు వింటున్నాం. నాన్న స్టైల్‌లో ఉండే కథ కోసం వెయిట్‌ చేస్తున్నాం. కుదిరితో నిర్మిస్తాం. – దేరంగుల జగన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు