‘వెంకటాద్రి...’కి వాయిస్ ఓవర్

22 Nov, 2013 01:12 IST|Sakshi
‘వెంకటాద్రి...’కి వాయిస్ ఓవర్
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లరి నరేష్... ఇప్పుడు ఓ కొత్త అవతారం ఎత్తారు. ఓ చిత్రం కోసం తన గాత్రాన్ని అరువిచ్చేశారాయన. అల్లరి నరేష్ ఏంటి? గాత్రదానం చేయడమేంటి? అనుకుంటున్నారా? గాత్రదానం అంటే వాయిస్ ఓవర్.  ఇంతకీ ఈ ‘సుడి గాడు’ వాయిస్ ఓవర్ ఇచ్చింది ఏ సినిమాకు అనుకుంటున్నారా? ఆ సినిమానే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. సందీప్ కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మించారు.
 
  గాంధీ మేర్లపాక దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో హీరోహీరోయిన్లు, కీలక పాత్రధారులను పరిచయం చేయడం కోసం నరేష్ వాయిస్‌ఓవర్ అందించారు. అల్లరి నరేష్ వాయిస్‌ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక, నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రమణ గోగుల, కెమెరా : చోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు.