సందేశాన్ని కూడా సరదాగా చెబుతాడు

30 Nov, 2019 00:29 IST|Sakshi
‘బన్నీ’ వాసు, మారుతి, అల్లు అరవింద్, రాశీ ఖన్నా, సాయి తేజ్, యస్‌.కె.యన్‌

– అల్లు అరవింద్‌

‘‘జీఏ2 యూవీ పిక్చర్స్‌ పతాకంపై మారుతి దర్శకత్వంలో మేం తీసిన ‘భలే భలే మగాడివోయ్‌’ మంచి హిట్‌ అయింది. ఆ సినిమా తర్వాత మారుతితో మరో మంచి చిత్రం తీయాలని ‘ప్రతిరోజూ పండగే’ తీశాం. మారుతిది ప్రత్యేక శైలి. సందేశాన్ని కూడా సరదాగా చెబుతాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 యూవీ పిక్చర్స్‌ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించారు.

ఈ సినిమా పాట చిత్రీకరణ చివరి రోజు భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఎన్‌ఆర్‌ఐల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. చాలా రోజుల తర్వాత మావాడు (సాయితేజ్‌) గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటిస్తున్నాడు. ఇందులో రాశీఖన్నా అదిరిపోయే పాత్ర చేసింది’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘అరవింద్‌గారికి కథ చెప్పేటప్పుడు ఎంత సౌకర్యంగా ఉంటుందో సినిమా తీసేటప్పుడు మాపై అంత బాధ్యత ఉంటుంది. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా. ఇది ఫుల్‌ మీల్స్‌లాంటి సినిమా. డిసెంబర్‌ 20న సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

సాయితేజ్‌ మాట్లాడుతూ– ‘‘గీతా ఆర్ట్స్‌లో, యూవీ క్రియేషన్స్‌లో చేయాలని చాలా రోజులుగా అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. మారుతిగారు కథ చెప్పగానే ఎగై్జట్‌ అయ్యాను. సినిమా చూస్తున్నంత సేపు నిజ జీవితాలను చూసినట్లు ఉంటుంది.  అందరూ కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఏంజెలా అనే టిక్‌టాక్‌ సెలబ్రిటీగా చేశా’’ అన్నారు రాశీఖన్నా. ‘‘తేజుకి, నాకు ఈ సినిమాతో మారుతిగారు మంచి సక్సెస్‌ ఇస్తున్నారు’’ అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌. నిర్మాతలు ‘బన్నీ’ వాసు, వంశీ, సహ నిర్మాత ఎస్‌కేఎన్, కెమెరామేన్‌ జై, డ్యాన్స్‌మాస్టర్‌ శేఖర్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా