నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు – అల్లు అర్జున్‌

27 Dec, 2017 06:54 IST|Sakshi
శ్యామ్‌ కె.నాయుడు, వీఐ ఆనంద్, సీరత్‌ కపూర్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సురభి

‘‘ఓ కొత్త కథను అరటిపండు వలిచినట్టు అందరికీ అర్థమయ్యేలా అందంగా చెప్పారు ఆనంద్‌. తను చెప్పిన కథ వినగానే నేను ఎగ్జయిట్‌ అయ్యా. ‘ఒక్క క్షణం’ వంటి మంచి సినిమాను శిరీష్‌తో తెరకెక్కించినందుకు ఆనంద్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా హిట్‌ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. అల్లు శిరీష్, సురభి, సీరత్‌ కపూర్, అవసరాల శ్రీనివాస్‌ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ఒక్క క్షణం’. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ–‘‘నిర్మాతగారి అబ్బాయిలుగా నిర్మాత విలువేంటో నాకు తెలుసు. నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు. నేను ‘దిల్‌’ రాజుగారితో జర్నీ స్టార్ట్‌ చేసినట్లే.. చక్రిగారితో శిరీష్‌ జర్నీ స్టార్ట్‌ చేశాడు. తన జర్నీ ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలి. ఆనంద్‌గారి ‘టైగర్‌’ సినిమా చూశా. చాలా బాగుందని శిరీష్‌కి చెప్పా. తను పెద్దగా విన్నట్లు కనపడలేదు.

తర్వాత ఓ రోజు నన్ను కలిసి నేను ఆనంద్‌గారితో సినిమా చేయబోతున్నాను అని అన్నాడు. అలా ఈ సినిమా ప్రారంభం కావడంలో నేను కూడా ఓ చిన్న పాత్ర పోషించాననిపిస్తోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా నేను గర్వపడే చిత్రం అవుతుందనుకుంటున్నా. జనవరి 1న టీజర్‌ రిలీజ్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో చక్రిగారు సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. 14 నెలలుగా శిరీష్‌ ఈ సినిమా కోసమే వర్క్‌ చేశారు’’ అన్నారు వీఐ ఆనంద్‌. ‘‘ప్యారలల్‌ లైఫ్‌ అనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త రకం సినిమా అవుతుంది’’ అన్నారు అల్లు శిరీష్‌. నటుడు నాగబాబు, సురభి, అవసరాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు