‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ

12 Jan, 2020 13:13 IST|Sakshi
Rating:  

టైటిల్‌: అల.. వైకుంఠపురములో
జానర్‌: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, మురళీ శర్మ, సముద్రఖని, జయరామ్‌, నివేదా పేతురాజు, సుశాంత్‌
దర్శక​త్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
సంగీతం: తమన్‌
నిర్మాతలు: అల్లు అరవింద్‌, రాధాకృష్ణ(చినబాబు)

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథనాయికగా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్ర టీజర్‌ హిట్‌.. ట్రైలర్‌ సూపర్‌ హిట్‌.. పాటలు సూపర్‌ డూపర్‌ హిట్టవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫలితం తర్వాత బన్ని గ్యాప్‌ తీసుకొని చేస్తున్న చిత్రం కావడం.. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్‌ ఈ సినిమాకు డైరెక్ట్‌ చేస్తుండటం.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు సూపర్‌ హిట్‌లు పడటంతో కామన్‌గానే ‘అల.. వైకుంఠపురములో’పై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. దీంతో సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుందా? బన్ని తనదైన స్టైల్‌ నటనతో మెప్పించాడా? త్రివిక్రమ్‌ తన మార్క్‌ సినిమా చూపించాడా? సెన్సేషనల్‌ రికార్డులతో తమన్‌ స్వరపరిచిన పాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయా? ఓవరాల్‌గా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ అల్లు హీరో విజయం సాధించాడా? అనేది సినిమా సమీక్షలో చూద్దాం.


కథ: 
బంటు (అల్లు అర్జున్‌), రాజ్‌ మనోహర్‌ (సుశాంత్‌)లు ఒకే ఆసుపత్రిలో ఒకే సమయానికి పుడతారు. అయితే బేసిక్‌గా బంటు ఫ్యామిలీ మిడిల్‌ క్లాస్‌, కాగా రాజ్‌ మనోహర్‌ది బాగా ఉన్నతమైన కుటుంబం. బంటు వాళ్ల నాన్న వాల్మీకి (మురళీ శర్మ) వీఏఆర్కే కంపెనీ అధినేత రామచంద్ర రావు (జయరామ్‌) దగ్గర పనిచేస్తుంటాడు. రామచంద్రరావు, యశ్‌(టబు)ల కుమారుడే రాజ్‌ మనోహర్‌. అయితే మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కావడం, తండ్రి వాల్మీకి పెట్టే ఓ రకమైన టార్చర్‌తో బంటు ఇబ్బందులు పడతాడు. అయితే ఈ క్రమంలోనే అమూల్య (పూజా హెగ్డే)తో బంటుకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. 

కాగా అప్పలనాయడు (సముద్రఖని) తన కొడుకు పైడితల్లి కోసం వీఏఆర్కే కంపెనీలో షేర్స్‌ కావాలని గొడవపెట్టుకుంటాడు. ఈ తరుణంలో రామచంద్రరావుపై హత్యాయత్నం జరుగుతుంది. అయితే రామచంద్రరావును కాపాడిన బంటుకు ఓ షాకింగ్‌ నిజం తెలుస్తుంది. దీంతో రామచంద్రరావును కాపాడేందుకు వైకుంఠపురములో అనే బంగ్లాలోకి దిగుతాడు. అయితే చివరకు ఏం జరిగింది? అప్పలనాయుడు కుటుంబం నుంచి వీఆర్కే కంపెనీని, రామచంద్రరావు కుటుంబాన్ని కాపాడాడా? ఈ కథలోకి కాశీ(హర్షవర్దన్‌), సీత (సునీల్‌), పెద్దాయన (సచిన్‌), శేఖర్‌ (నవదీప్‌), ఎస్పీ (రాజేంద్ర ప్రసాద్‌), నివేదా పేతురాజులు ఎందుకు ఎంటరవుతారు? ఆస్పత్రిలో బంటుకు తెలిసిన నిజం ఏమిటి? ఈ సినిమా కథకు ఈశ్వరికి ఉన్న సంబంధం ఏమిటి? రామచంద్రరావు అంటే వాల్మీకి ఎందుకు పడదు? బంటు రాజు ఎలా అయ్యాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అదే అసలు కథ.. ‘అల.. వైకుంఠపురములో’ కథ. 

నటీనటులు: 
ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించిన అల్లు అర్జున్‌.. మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఎమోషన్‌ సీన్లలో తేలిపోతాడనే చిన్న అపవాదు ఉండేది. అయితే ఈ సినిమాతో ఎమోషన్స్‌ అనే ముచ్చటను కూడా తీర్చేశాడు. బన్ని అనగానే మనందరికి గుర్తొచ్చేది ఎనర్జీ, డ్యాన్స్‌లు, కామెడీ పంచింగ్‌ టైమ్‌. అయితే ఈ సినిమాలో వీటితో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు.. మైమరిపించాడు. దాదాపు సినిమా మొత్తం అల్లు అర్జున్‌ చుట్టే తిరుగుతుంది. దీంతో ఆ బాధ్యతను బన్ని మంచినీళ్లు తాగినంత సులువుగా మోశాడు. ఈ సినిమాతో నటుడిగా, హీరోగా వంద శాతం ప్రూవ్‌ చేసుకున్నాడు. అల్లు అర్జున్‌ తర్వాత చెప్పుకోవాల్సింది మురళీ శర్మ గురించి. కన్నింగ్‌, శాడిజం ఇలా పలు వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొడుకుపై శాడిజం చూపించే తండ్రిగా మురళీ శర్మ జీవించాడు. 

పూజా హేగ్డే చాలా అందంగా కనిపిస్తుంది. ట్రైలర్‌లో బన్ని చెప్పినట్టు ‘మేడమ్‌ సర్‌.. మేడమ్‌ అంతే’ అనే విధంగా పూజా ఉంటుంది. అందంతో పాటు అభినయంతో హావభావాలను పలికించింది. ఇక సుశాంత్‌ సెటిల్డ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో విలన్‌గా కనిపించిన సముద్రఖనికి ఎక్కువ సీన్లు పడలేదు. అయితే డిఫరెంట్‌ మేనరిజంతో పర్వాలేదనిపించాడు. సచిన్‌, జయరామ్‌లు కొన్ని ఎమోషన్స్‌ సీన్లలో కంటతడి పెట్టించారు. చాలా కాలంతర్వాత తెలుగు సినిమాలో కనిపించిన టబుకు పెద్ద క్యారెక్టర్‌ లభించకపో​యినప్పటకీ ఉన్నంతలో ఆకట్టుకుంది. నిన్నే పెళ్లాడతా సినిమాలో టబును చూసినట్టే ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. ఇక రాహుల్‌ రామకృష్ణ, సునీల్‌, రాజేంద్రప్రసాద్‌, హర్షవర్దన్‌లు చేసే కామెడీ ఓ మోస్తారుగా ఉంటుంది. నవదీప్‌ ఉన్నంతలో ఉన్నంత ఫర్వాలేదనిపించాడు. 

విశ్లేషణ: 
సినిమా ఆరంభం నుంచి దర్శకుడు, హీరో చెప్పిన ఒకే మాట. సరదాగా ఓ సినిమా తీద్దాం అనుకున్నాం.. అలాగే తీశాం అని చెప్పారు. వారు చెప్పింది అక్షరాల నిజమని సినిమా చూస్తే అర్థమవుతుంది. భారీ చేజింగ్‌లు, పోరాట సన్నివేశాలు, కథలో ఊహించని మలుపులు అంటూ పెద్దగా ఏమీ కనిపించవు. కానీ పంచభక్ష పరమాన్నాలు వడ్డించిన విస్తరిలా నిండుగా, అందంగా ఈ సినిమా ఉంటుంది. త్రివిక్రమ్‌ మార్క్‌​ టేకింగ్‌.. అల్లు అర్జున్‌ కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌లు, పాటలు సింపుల్‌గా చెప్పాలంటే సినిమా సరదా సరదాగా, ఎక్కడా బోర్‌ కొట్టకుండా సాఫీగా సాగుతూ వెళ్తుంది.

అయితే సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే కథేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అయితే కథ ముందే చెప్పేసి దాదాపు మూడు గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీలోంచి లేవకుండా చేయడంలో త్రివిక్రమ్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ ముందే తెలిసినా తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగేలా స్క్రీన్‌ ప్లే ఉంటుంది. ఇక కథలో ఎలాంటి కొత్త దనం లేనప్పటికీ త్రివిక్రమ్‌పై నమ్మకంతో సినిమాకు అంగీకరించిన బన్ని గట్స్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఎందుకంటే గ్యాప్‌ తర్వాత వచ్చే సినిమా హిట్‌ సాధించాలి కానీ ఇరిటేట్‌ చేయకూడదు. అయితే బన్ని నమ్మకాన్ని త్రివిక్రమ్‌ నూటికి నూరుశాతం నిలబెట్టాడు.
https://m.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif
అల్లు అర్జున్‌, పూజా హెగ్డేల మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ క్యూట్‌గా, కొత్తగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. బన్ని చేత త్రివిక్రమ్‌ పలికించే పలు డైలాగ్‌లు హృదయానికి తాకేలా, మరికొన్ని కామెడీగా, ఆలోచించేవిధంగా ఉంటాయి. ‘వాడికి ఫ్యాన్స్‌ ఉన్నారు కాబట్టి చప్పట్లు కొట్టారు.. నీకు లేరు కాబట్టి చపట్లు కొట్టలేదు’, ‘పాపడాలు వడ్డించడమేనా.. చెప్పడాలు లేవా’ అంటూ వచ్చే డైలాగ్‌లు సరదగా ఉంటాయి. ఇక త్రివిక్రమ్‌ సినిమా అంటే ఏదో ఒక కామెడీ స్కిట్‌ సాధారణంగా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా చిన్న కామెడీ స్కిట్‌ ఉంటుంది. పలు హీరోల హిట్‌ పాటలతో అల్లు అర్జున్‌ చేసే ఇమిటేషన్‌ స్టెప్పులు నవ్వులు తెప్పిస్తాయి.

విలనిజం తక్కువైనా ఎమోషన్‌ సీన్స్‌ బాగున్నాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, హీరో ఎలివేషన్‌ సీన్స్‌, పలు సన్నివేశాలకు తమన్‌ ఇచ్చిన ఆర్‌ఆర్‌ భలే ఆకట్టుకుంటుంది. ఇక మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన తండ్రి గురించి చెబుతూ బన్ని ఎందుకు భావోద్వేగమవుతాడో ఈ సినిమా చివర్లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్‌ సీన్లతో అర్థమవుతుంది. ఇక ఇప్పటివరకు డ్యాన్స్‌ల్లో తన మార్క్‌ స్టైల్‌ చూపెట్టిన అల్లు అర్జున్‌.. ఈ సినిమాలో కొత్తగా, వైవిధ్యంగా, స్టైల్‌గా ఫైట్‌ చేశాడు. కొన్ని ఫైట్‌ సీన్లయితే వావ్‌ అనిపించేలా ఉన్నాయి. అలా కంపోజ్‌ చేశారు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌. ఇక క్లైమాక్స్‌లో శ్రీకాకుళం యాసలో వచ్చే ఓ సాంగ్‌ సూపర్బ్‌గా ఉంటుంది.  

ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాను చాలా రిచ్‌గా, హీరోహీరోయిన్లను అందంగా చూపించారు సినిమాటోగ్రఫర్‌ వినోద్‌. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ హిట్‌ పాటలు సినిమాలో ఇరికిచ్చినట్లు ఉంటాయని అందరూ భయపడినప్పటికీ అవి సందర్బానుసారంగా వస్తాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ పాట సరైన సమయంలో పడుతుంది. ఇక త్రివిక్రమ్‌ సినిమాల్లోని పాటల్లో సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటల రచయితలు తమ సాహిత్యంతో సినిమా స్థాయిని మరింత పెంచారు. ఎడిటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాల్సింది. త్రివిక్రమ్‌ కూడా తన మాటలకు ఇంకాస్త పదును పెట్టాల్సింది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. 

ఓవరాల్‌గా చెప్పాలంటే పండగ వచ్చిందంటే ఈ గజిబిజీ సిటీ లైఫ్‌ను వదిలేసి మన అమ్మమ్మ వాళ్లింటికి లేదా మన ఊరికి వెళితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ సినిమా చూస్తే కూడా అలాంటి అనుభూతి, ఫీల్‌ కలుగడం పక్కా! 

ప్లస్‌ పాయింట్స్‌:
అల్లు అర్జున్‌ నటన
పాటలు, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌
యాక్షన్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌:
సినిమా నిడివి
కథలో కొత్తదనం లేకపోవడం

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

https://m.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif

Rating:  
(3/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు