తప్పుగా మాట్లాడినా తమిళే మాట్లాడతా!

23 Sep, 2016 00:38 IST|Sakshi
తప్పుగా మాట్లాడినా తమిళే మాట్లాడతా!


 ‘‘నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. ఇక్కడే చదువుకున్నా. చెన్నైలో 20 ఏళ్లు ఉన్నాను. అందుకని నన్ను ఇక్కడివాడిలానే భావించవచ్చు. తప్పుగా మాట్లాడినా తమిళంలోనే మాట్లాడాలనుకుంటున్నాను. ‘ఎల్లారుక్కుమ్ వణక్కమ్’ (అందరికీ నమస్కారం)’’ అని అల్లు అర్జున్ అన్నారు. లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పతాకంపై అల్లు అర్జున్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ - ‘‘తమిళ సినిమా చేయాలని, మంచి దర్శకుడితో చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను.
 
  ఇప్పటివరకూ నేను నటించిన తెలుగు సినిమాల్లో ఒక్క చిత్రాన్ని కూడా తమిళంలో అనువదించి, విడుదల చేయలేదు. ఎందుకంటే నేను పుట్టిన చెన్నైలో స్ట్రైట్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం కావాలనుకున్నాను’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్‌ని మా సంస్థ ద్వారా తమిళ్‌కి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో లేదా మార్చి ప్రథమార్ధంలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని జ్ఞానవేల్ రాజా చెప్పారు. ‘‘ఇప్పటివరకూ నేను కలిసిన స్టార్స్‌లో అల్లు అర్జున్ మోస్ట్ ఎనర్జిటిక్, హార్డ్ వర్కింగ్. అందుకే తనతో సినిమా చేయాలనుకున్నాను’’ అని లింగుస్వామి అన్నారు. సీనియర్ నటుడు, హీరోలు సూర్య-కార్తీ తండ్రి శివకుమార్ పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు శిరీష్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.