‘సొంతగడ్డలో జయిస్తే ఆ కిక్కే వేరు’

22 Sep, 2016 19:46 IST|Sakshi
సొంతగడ్డలో జయిస్తే ఆ కిక్కే వేరు: బన్నీ

చెన్నై: సొంతగడ్డలో జయిస్తే ఆ కిక్కే వేరు అంటున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. తాజాగా 'సరైనోడు' తో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ ఇప్పుడు అదే జోరును కోలీవుడ్‌లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నాడు. చాలాకాలంగా అల్లు అర్జున్ తమిళ చిత్ర రంగప్రవేశం చేయాలన్న కోరిక నిజమయ్యే తరుణం వచ్చేసింది. లింగుసామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ. జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్న ద్విభాషా చిత్రంలో బన్నీ కథానాయకుడిగా నటించనున్నాడు.

తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి గురువారం చెన్నైలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ..తాను ఈ వేదికపై తమిళంలోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నానన్నాడు. తప్పులు దొర్లినా తమిళంలోనే మాట్లాడతానని తెలిపాడు.

తాను పుట్టి పెరిగింది చెన్నైలోనేనని.. 20 ఏళ్ల వరకూ ఇక్కడే గడిపానని, ఆ తరువాత నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నానని చెప్పారు. తన సొంత ఊరు చెన్నైయేనని పేర్కొన్నాడు. తెలుగులో చాలా చిత్రాల్లో నటించినా ఒక్క చిత్రాన్ని తమిళంలోకి అనువదించి విడుదల చేయలేదని అన్నాడు. కారణం తమిళంలోకి నేరుగా పరిచయం అవ్వాలన్న కోరికేనన్నాడు.


అలాంటి అవకాశం కోసం చాలా కాలంగా వేచి ఉన్నానని.. అది ఇప్పటికి నెరవేరనుందని చెప్పుకొచ్చాడు. తనను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు లింగుసామి తన భుజాలపై వేసుకున్నారని తెలిపాడు. నిర్మాత జ్ఞానవేల్ రాజా, నటుడు శివకుమార్, దర్శకుడు లింగుసామి, అల్లు శిరీష్, కథా రచయిత బృందాసారథి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.