సపోర్ట్‌ చేయడం నా బాధ్యత అనుకున్నా

25 Jan, 2019 06:13 IST|Sakshi
ప్రియా ప్రకాష్, రోషన్, అల్లు అర్జున్, వినోద్‌ రెడ్డి, గురురాజ్‌

అల్లు అర్జున్‌

‘‘సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో నేషనల్‌ వైడ్‌గా, ఇంటర్నేషనల్‌ వైడ్‌గా వైరల్‌ అయిన వీడియోస్‌లో ‘కొలవెరి డీ..’ పాట, ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’... ఈ మధ్య కాలంలో ఆ రేంజ్‌లో వైరల్‌ అయిన వీడియోస్‌లో ‘ఒరు ఆధార్‌ లవ్‌’ కూడా ఒకటి’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. ప్రియా ప్రకాష్‌ వారియర్, నూరిన్‌ షరీఫ్, రోషన్‌ ముఖ్య తారలుగా ఒమర్‌ లులు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’. ఈ చిత్రాన్ని ‘లవర్స్‌ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్‌ పతాకంపై ఎ. గురురాజ్, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. షాన్‌ రెహమాన్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు సౌతిండియా అంటే పిచ్చి.

నా ప్రొఫెషన్‌లో సౌతిండియన్‌ యాక్టర్‌ అని రాసుకుంటాను. నేను దక్షిణాదికి చెందినవాడినని చెప్పుకోవడానికి గర్వపడతాను. నేను పుట్టింది చెన్నైలో.. పెరిగింది హైదరాబాద్‌లో.. మలయాళం, కర్ణాటకవాళ్లు కూడా నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి నేను సౌతిండియన్‌నే. నా సినిమాలను కేరళవాళ్లు సొంత సినిమాల్లాగా ఆదరిస్తున్నారు. ఓ ల్యాండ్‌ మార్క్‌ ఉన్న మలయాళ సినిమా తెలుగులోకి వస్తున్నప్పుడు నేను సపోర్ట్‌ చేయాలని భావించా. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సమయంలో వినోద్‌ రెడ్డిగారిని ‘బన్నీ’వాసు పరిచయం చేశాడు. ఆయన అడగ్గానే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నేను ఎంత కాలం నిలబడగలనో తెలియదు కానీ.. అవకాశం ఉన్న ప్రతిసారీ నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరి కోసం నిలబడతా’’ అన్నారు.

‘‘మలయాళంలో ఎంత మంది స్టార్స్‌ ఉన్నా మా సినిమా వీడియోను ఎవరూ షేర్‌ చేయలేదు. అల్లు అర్జున్‌గారు మాత్రమే షేర్‌ చేశారు’’ అన్నారు ఒమర్‌ లులు. ‘‘అల్లు అర్జున్‌గారంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి స్టేజ్‌పై నిలబడే అవకాశం వస్తుందనుకోలేదు. ఆయన్ను కలుసుకున్నందుకు వెరీ హ్యాపీ’’ అని ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అన్నారు. ‘‘మా యూనిట్‌ని సపోర్ట్‌ చేయడానికి వచ్చిన అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు చిత్రసమర్పకుడు వినోద్‌ రెడ్డి. ‘‘సీతారామరాజుగారు, సురేశ్‌గారి సపోర్ట్‌తో ‘లవర్స్‌ డే’ సినిమా అవకాశం దక్కించుకున్నాను. అల్లు అర్జున్‌తో పాటు చాలా మంది నన్ను సపోర్ట్‌ చేయడానికి వచ్చారు. ఇందుకు వారికి థ్యాంక్స్‌’’ అని ఎ.గురురాజ్‌ అన్నారు. నటుడు అలీ, నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ, పాటల రచయిత చైతన్య ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు