సంక్రాంతి రేసులో గుర్రం

24 Oct, 2013 00:34 IST|Sakshi

అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో దిగడానికి ‘రేసుగుర్రం’లా సిద్ధమవుతున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘రేసుగుర్రం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయిక. వీరిద్దరి కలయికలో ఇదే తొలి చిత్రం. బన్నీ చిత్రానికి తమన్ స్వరాలందించడం కూడా ఇదే తొలిసారి. భోజ్‌పురిలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతోన్న రవికిషన్ ఇందులో ప్రతినాయకునిగా నటిస్తుండటం విశేషం.
 
నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన విలన్ హౌస్ సెట్‌లో ప్రస్తుతం అల్లు అర్జున్, రవికిషన్, ముఖేష్‌రిషి తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ షెడ్యూలు చిత్రం పూర్తయ్యే వరకూ నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన పాటలను కూడా ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరించనున్నారు.
 
ఇందులో బన్నీ పాత్ర చిత్రణ చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరులో పాటలను, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘కిక్’ శ్యామ్, సలోని ఇందులో ముఖ్యతారలు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి