‘నా పేరు సూర్య..’ చేసినందుకు గర్వపడుతున్నా

11 May, 2018 00:21 IST|Sakshi
లగడపాటి శ్రీధర్, వక్కంతం వంశీ, పవన్‌ కల్యాణ్, అల్లు అర్జున్, ‘బన్నీ’ వాసు

అల్లు అర్జున్‌

‘‘అందరికీ నమస్కారం. నా పేరు అల్లు అర్జున్‌. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్షన్‌ పేరు థ్యాంక్యూ ఇండియా. ఇక్కడ నేను ఫస్ట్‌ థ్యాంక్యూ చెప్పాల్సింది మా గెస్ట్‌ పవన్‌ కల్యాణ్‌గారికి. ఈ సినిమా గురించి ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటుంది. కానీ, నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలైంది.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ‘థ్యాంక్యూ ఇండియా మీట్‌’ (సక్సెస్‌ మీట్‌) నిర్వహించారు. హీరో పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నాకు వచ్చిన ఓ బెస్ట్‌ కాంప్లిమెంట్‌ గురించి చెబుతాను. చాలామంది మహిళలు ఫోన్‌ చేసి.. ఈ సినిమా మాకు చాలా బాగుంది. మా పిల్లలు ఈ సినిమా చూశాక మిలటరీ యూనిఫాం కుట్టించుకోవాలనుకుంటున్నారు’’ అన్నారు. ఈ మూవీలో నా నటన చాలామందికి నచ్చింది. వండర్‌ఫుల్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది.

మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు.నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఓ మంచి చిత్రం. ఇలాంటి మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పటానికి కల్యాణ్‌గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మంచి సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చిన బన్నీకి థ్యాంక్స్‌. నేనెప్పుడూ కథని నమ్ముతాను. ఆ కథకి ఎంటర్‌టైన్‌మెంట్‌ యాడ్‌ చేశారు బన్నీగారు.

దానికి సహకరించారు వక్కంతం వంశీగారు. ఈ సినిమాని తర్వాతి జెనరేషన్‌ కోసం తీశాం. ఈ చిత్రం చూసిన స్టూడెంట్స్‌లో ఓ మార్పు వస్తుందని కచ్చితంగా నమ్ముతా. ఈ వేసవిలో కుటుంబంతో కలిసి ఈ సినిమాకి వెళ్లి ఎంజాయ్‌ చేయండి. వండర్‌ఫుల్‌ జ్ఞాపకాలతో ఇంటికెళతారని గ్యారంటీగా చెప్పగలను. మా సినిమాని ఆదరించిన తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నా తొలి సినిమాకే ఇంత పెద్ద అవకాశం రావడం హ్యాపీ.

మంచి కథను కూడా కమర్షియల్‌ సినిమాగా తీయొచ్చనే నా నమ్మకాన్ని నమ్మి నాతో ప్రయాణం చేసిన అర్జున్‌గారికి, ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమా ఇంత రిచ్‌గా రావడానికి కృషి చేసిన శ్రీధర్‌గారు, నాగబాబుగారు, ‘బన్నీ’వాసులకు థ్యాంక్స్‌. మంచి కంటెంట్‌తో ఉన్న ఈ సినిమాని గుండెల్లోకి తీసుకున్న తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శిరీషా శ్రీధర్, నాగబాబు, సహ నిర్మాత ‘బన్నీ’ వాసు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు