నట్టింట్లోకి నెట్టుకొస్తున్న సినిమా

11 Mar, 2020 03:25 IST|Sakshi

భవిష్యత్‌ అంతా ‘ఓటీటీ’దేనా?

సినిమా ఇంకా థియేటర్లో ఉండగానే టీవీలోనో, కంప్యూటర్లోనో, సెల్‌ఫోన్‌లోనో చూసే చాన్స్‌ వస్తే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లే. అది కూడా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమానో వేరే స్టార్‌ హీరో సినిమానో అయితే చేతిలో ఉన్న రొట్టె విరిగి నెయ్యిలో పడ్డట్టే. తంతే బూరెల బుట్టలో పడ్డట్లే. సినిమా లవర్స్‌కి ‘ఓటీటీ’ ఇలాంటి బంపర్‌ ఆఫర్లే ఇస్తోంది. ‘ఓటీటీ’ అంటే ‘ఓవర్‌ ది టాప్‌’ అని అర్థం. ‘పై చేయి’ అన్నమాట. నిజమే.. పరిస్థితి చూస్తుంటే సినిమాకంటే ‘డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌’దే పై చేయి అయ్యే చాన్స్‌ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఓటీటీ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఇప్పుడు సీరియల్స్, వెబ్‌ సిరీస్‌లు, పార్కులు, పబ్బులు, గేమింగ్‌ జోన్లు.. ఇలా ఎన్నో. ఇవి కాదనుకుని ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే సినిమా అద్భుతంగా ఉండాలి. అయినా వంద రోజులు ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకప్పుడు పదులు, వందల్లో ఉండే థియేటర్ల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. వేల థియేటర్లలో సినిమా రిలీజ్‌ అవ్వడంతో మహా అయితే బొమ్మ (సినిమా) ఏడెనిమిది వారాలు స్క్రీన్‌ మీద ఉంటుంది.. అంతే. అయితే థియేటర్లో ఉన్న సినిమా ఈ ఏడెనిమిది వారాల్లోపు ఎక్కడైనా దర్శనమిస్తే.. ఇక థియేటర్‌కి వెళ్లి చూడాలనుకున్నవాళ్లు కూడా ఇంటిపట్టునే చూడాలనుకుంటారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌.. ఇలా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాగూ వచ్చేస్తాయి కాబట్టి వచ్చినప్పుడు సినిమా చూసేద్దాం.. పనిగట్టుకుని థియేటర్‌కి వెళ్లడం ఎందుకని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యారు. థియేటర్‌ అధినేతలకు ఈ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తెలుగు పరిశ్రమలో ఇంకా ఈ విషయమై వివాదాలు జరుగుతున్నట్లు కనిపించడంలేదు కానీ తమిళ పరిశ్రమకు చెందిన పంపిణీదారులు, థియేటర్‌ అధినేతలు చర్చలు మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే...

రజనీకాంత్‌ ‘దర్బార్‌’ విడుదలై 50వ రోజు పూర్తి కాకుండానే డిజిటల్‌కి వచ్చేసింది. ఇక థియేటర్‌కి ఎవరు వెళతారు? కార్తీ నటించిన ‘ఖైదీ’ అయితే విడుదలైన 30వ రోజు లోపే నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఇలా అయితే సినిమా కొనుక్కున్నవాళ్ల పరిస్థితి ఏంటి? ఆడించేవాళ్ల (థియేటర్‌ ఓనర్స్‌) పరిస్థితి ఏంటి?  ఈ విషయంపై తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఓ మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ‘‘సినిమా విడుదలైన ఎనిమిది వారాలు లేదా 100 రోజులు తర్వాతే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో, టీవీ చానల్స్‌లో విడుదల చేయాలి’’ అని సినిమా కొనే ముందు అగ్రిమెంట్‌లో రాయించుకోవాలనుకుంటున్నారు. పంపిణీదారులు, థియేటర్‌ అధినేతల అభిప్రాయం ఇలా ఉంటే.. ‘‘ఒకవేళ మా సినిమాను థియేటర్‌లో 50 నుంచి 60 రోజులు ఆడిస్తానంటే అప్పుడు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌’లో విడుదలను జాప్యం చేస్తాం’’ అంటూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ల ముందు కొందరు నిర్మాతలు ఓ డిమాండ్‌ ఉంచారు. ‘‘చిన్న సినిమాలకు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌’ బెస్ట్‌. విడుదలైన నెలలోపు ఓటీటీలో వచ్చేస్తే చిన్న సినిమా నిర్మాతకు కాస్త రెవెన్యూ వస్తుంది’’ అన్నది ఓ నిర్మాత వాదన. ప్రస్తుతం తమిళ పరిశ్రమలో ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇక మన తెలుగు విషయానికొస్తే... మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలు విడుదలైన 50 రోజులకు రీచ్‌ అయ్యే టైమ్‌కి నెట్టింట్లోకి రావడం విశేషం.  సినిమా థియేటర్లో ఉండగానే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కి వస్తే... ఎగ్జిబిటర్స్‌కి కొంత మేర నష్టం జరుగుతుందనే చెప్పాలి. ఒకవేళ 50 రోజుల్లో రెవెన్యూ వచ్చేస్తే.. ఆ తర్వాత బోనస్‌గా వచ్చే వసూళ్లకు గండిపడినట్లే. అయితే చిన్న సినిమాలకు ‘ఓటీటీ’ పెద్ద వరం. టెక్నాలజీ పెరిగే కొద్దీ పెను మార్పులు వస్తుంటాయి. ఈ మార్పు అందరి మంచికీ కారణం అయితే అదేదో యాడ్‌లో ‘మరక మంచిదే’ అన్నట్లుగా ‘మార్పు మంచిదే’ అనుకోవచ్చు.

ఓటీటీ కోసమే సినిమాలు నిర్మించనున్నాం  – నిర్మాత అల్లు అరవింద్‌
గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీస్తున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘ఆహా’ పేరుతో వచ్చిన ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో వెబ్‌ సిరీస్, సినిమాల స్ట్రీమింగ్‌ జరుగుతాయి. ‘‘ప్రారంభమైన రెండు వారాల్లోనే ఆరు లక్షల పైనే రిజిస్ట్రేషన్స్‌ పూర్తయ్యాయి’’ అని ‘ఆహా’ ప్రతినిధులు తెలిపారు. ఒకవైపు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో ఉన్నారు అల్లు అరవింద్‌.æమరి.. సినిమా విడుదల తర్వాత ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించాలంటే ఎన్ని వారాలు గ్యాప్‌ ఉండాలి? చిన్న సినిమాలకు ‘ఓటీటీ’ వల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది? అనే

ప్రశ్నలకు అల్లు అరవింద్‌ ఈ విధంగా చెప్పారు.
►ఓ నెల తిరక్కుండానే అనూహ్యంగా ఐదు లక్షల మంది మా ‘ఆహా’ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. నాలుగైదు నెలల్లో మా యాప్‌కి ఇంత స్పందన వస్తుందనుకుంటే నెలకే వచ్చింది. సో.. ఓటీటీలకు కూడా జనం పెరుగుతున్నారు. ప్రజలకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడమే ఇండస్ట్రీ ఉద్దేశం. ఓటీటీ కోసమే నిర్మించే సినిమాలు అతి త్వరలో రాబోతున్నాయి. మంచి కథతో వస్తే మేమే రెండు మూడు కోట్ల రూపాయలు ఆఫర్‌ చేసి, ఓటీటీ కోసమే సినిమాలు తీయమని చెప్పబోతున్నాం. దీనివల్ల చాలా మందికి అవకాశాలు పెరుగుతాయి. ఓటీటీల కోసమే సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య పెరుగుతుంది. మనం థియేటర్స్‌కి వెళ్లకుండా ఓటీటీ వాళ్లకే సినిమా ఇవ్వొచ్చు, ఓ 50 లక్షలు సంపాదించుకోవచ్చనే అభిప్రాయం చిన్న సినిమా నిర్మాతలకు ఏర్పడుతుంది.

►చిన్న సినిమాలకు థియేటర్‌లో ఏడెనిమిది వారాల సమయం పెట్టలేం. మా సినిమాలు ఓటీటీలో పడటం లేదని చిన్న సినిమాల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది.. మాకు అంత సమయం పెట్టొద్దని అంటున్నారు. అయితే ‘ఓటీటీలో ఇచ్చేట్లు అయితే డైరెక్ట్‌గా ఇచ్చేసుకోండి మాకు అవసరం లేదు’ అని ఎగ్జిబిటర్స్‌ అంటున్నారు. దీన్ని ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ టేకప్‌ చేసి రూల్స్‌ పెడితే బాగుంటుందను కుంటున్నా. చిన్న సినిమా అంటే నా ఉద్దేశం ఐదు కోట్ల లోపు చేసేవి. ఆ చిన్న సినిమాలకి ఓటీటీ వాళ్లు ఇచ్చేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నాలుగు వారాలు దాటాక 30 రోజుల్లోనే మేము ఇచ్చుకుంటాం అని చిన్న సినిమా వాళ్లు అడుగుతున్నారు. ఫైనాన్షియల్‌గా సేఫ్‌ అవుతామనే ఉద్దేశంతో ఓటీటీలకు ఇవ్వాలనుకుంటారు.. చిన్న సినిమా వాళ్లు గ్రహించాల్సింది ఏంటంటే.. నాలుగువారాల్లో ఓటీటీలో వస్తుందనుకుంటే థియేటర్‌కి వెళ్లి చూడాల్సిన అవసరం ఏంటి? అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. అది గ్రహించి చిన్న సినిమా వాళ్లు కూడా పెద్ద సినిమాల్లా ఎనిమిది వారాలకు ఒప్పుకుంటే బాగుంటుంది. అయితే పెద్ద సినిమాలు ఎలాగూ 8 వారాలు ఆడతాయిలే అని నిర్మాతలు అనుకుంటున్నారు.. ఇందుకు ఓటీటీ వాళ్లు కూడా ఒప్పుకుంటున్నారు.

8 వారాలు గ్యాప్‌ ఉండాలి – నిర్మాత  డి. సురేష్‌బాబు
‘‘సినిమా విడుదలైన తర్వాత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శితం అవ్వాలంటే కనీసం ఎనిమిది వారాలు గ్యాప్‌ ఉండాలి. అదే కరెక్ట్‌ అంటాను. అయితే ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌’ అధినేతలు కొందరు ఈ విషయంతో ఏకీభవించడంలేదు. 30 రోజుల్లో అయితేనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో సినిమాని ప్రదర్శించే హక్కులు కొంటామని  కొందరు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌’ ప్లేయర్స్‌ నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా