వాళ్లు చెబితే ఒప్పుకుని తీరాలి

16 May, 2019 02:57 IST|Sakshi
అల్లు శిరీష్‌

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరేళ్లు అవుతుంది. ఐదు సినిమాలు చేశాను. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, మోహన్‌లాల్‌ వంటి గొప్ప నటులతో నటించాను. మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనిపించింది. యాక్టర్‌గా నన్ను నేను ఇంప్రూవ్‌ చేసుకోవడానికి ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని అల్లు శిరీష్‌ అన్నారు. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. డి. సురేష్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించారు. మలయాళంలో దుల్కర్‌సల్మాన్‌ నటించిన ‘ఏబీసీడీ’ (2012) సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్‌ చెప్పిన సంగతులు.

► మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రాన్ని రెండేళ్ల క్రితం చూశాను. బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమా చూడమని రామ్‌చరణ్‌ చెప్పారు. దర్శకుడు మారుతి, వరుణ్‌ తేజ్‌ ఇలా ఇండస్ట్రీలోని నా సన్నిహితులు కూడా ఈ సినిమా గురించి చెప్పారు. సాధారణంగా అందరూ రీమేక్‌ ఈజీ అంటారు కానీ అంత ఈజీ కాదు. తెలుగు కోసం కొన్ని మార్పులు చేశాం. కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఒరిజినల్‌ సినిమాలో ఉన్నవి ఉంటాయి. సోల్‌ని మాత్రమే తీసుకున్నాం. సంజీవ్‌ బాగా తీశారు.

► ఈ సినిమాలో నా పాత్ర పేరు అవి. అమ్మ ప్రేమ చాటున గారాభంగా పెరుగుతున్న అవికి అంతగా డబ్బు విలువ తెలియదు. ఆ విలువ తెలియడానికి అవి తండ్రి తనను ఇండియాకి పంపి, మధ్యతరగతి జీవితం గడిపేలా ప్లాన్‌ చేస్తాడు. ఆ ప్రాసెస్‌లో అవి లైఫ్‌లో ఎలాంటి విషయాలను నేర్చుకున్నాడు అన్నదే కథ.

► నాకు, భరత్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేలా ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్‌ కాపీని చూశాం. సినిమా పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

► నేను ముంబైలో నాలుగేళ్లు ఉన్నాను. అక్కడ నేను ఆల్మోస్ట్‌ నార్మల్‌ జీవితాన్ని గడిపాను. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణం చేసేవాణ్ణి. సినిమాలు చూడాలనుకున్నపుడు అక్కడ మార్నింగ్‌ షో అయితే టికెట్‌ రేటు తక్కువగా ఉంటుందని ఆ షోలకు వెళ్లాను. ముంబైలో నేను గడిపిన ఆ నాలుగేళ్లు నాలో చాలా మార్పు తెచ్చాయి. ఆ తర్వాత స్టడీస్‌ కోసం న్యూయార్క్‌ వెళ్లినప్పుడు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త తీసుకున్నాను.

► నేను ‘కొత్తజంట’ సినిమా చేస్తున్న సమయంలో ఓ సందర్భంలో దర్శకుడు సుకుమార్‌గారిని కలిశాను. డీసెంట్‌ యాక్టర్‌కి, గుడ్‌ యాక్టర్‌ తేడా ఏంటి? అన్న సంభాషణ వచ్చింది. ‘‘దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చెసేవాడు యాక్టర్‌. దర్శకుడు చెప్పింది చేస్తూనే ఏదో తన సొంతగా, కొత్తగా ప్రయత్నించాలని తపన పడేవాడు గుడ్‌ యాక్టర్‌’ అని చెప్పకొచ్చారు. అప్పట్నుంచి ప్రతి సినిమాకి నేను కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

► ‘ఒక్క క్షణం’ సినిమాకు బాగా కష్టపడ్డాం. ఫస్ట్‌ కాపీ చూసి చాలా సంతోషపడ్డాను. కానీ ప్రేక్షకుల నుంచి మేం ఆశించిన ఫలితం రాలేదు. సినిమా రిజల్ట్‌ విషయంలో ప్రేక్షకుల తీర్పు మనకు నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకుని తీరాలి. ఆన్‌లైన్‌ ఆడియన్స్‌కు బాగానే నచ్చింది. ప్రస్తుతం రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి లవ్‌స్టోరీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా