మన సినిమాలు అక్కడవరకూ వెళ్లాలి

17 May, 2018 01:47 IST|Sakshi
అల్లు శిరీష్‌

‘‘కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో తెలుగు సినిమాల ప్రదర్శన లేకపోవడం బాధాకరం. ఈ విషయం గురించి తెలుగు ఇండస్ట్రీలో కొంతమందితో మాట్లాడాను. అయితే కాన్స్‌ ఉత్సవాల వరకూ ఎలా వెళ్లాలి? అనే విషయంలో తమకు సరైన అవగాహన లేదన్నట్లుగా వారు చెప్పారు. మన వైపు నుంచి ప్రయత్నం ఉంటే బాగుంటుందని ఐ అండ్‌ బీ మినిస్ట్రీ పేర్కొంది’’ అని అల్లు శిరీష్‌ అన్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కాన్స్‌ చలన చిత్రోత్సవాలకు శిరీష్‌ వెళ్లారు.

ఈ సందర్భంగా తన అనుభవాల గురించి శిరీష్‌ మాట్లాడుతూ– ‘‘ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే చిత్రాలను చూసేందుకు, విభిన్న చిత్రాలను తీసే దర్శకులను కలిసి మూవీస్‌ గురించి డిస్కస్‌ చేసేందుకు కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి వెళ్లాను. మినిస్ట్రీ ఆఫ్‌ ఐ అండ్‌ బి (మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌) అండ్‌ ఎఫ్‌ఐసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) నిర్వహించిన కొన్ని సెమినార్స్‌లో పాల్గొని, ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను.

టాలీవుడ్, బాలీవుడ్‌ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్మెంట్‌ ప్రపంచం ఎంత పెద్దగా ఉందో తెలిసింది. అంతేకాదు దేశంలో నార్త్‌ ఈస్ట్‌ నుంచి వచ్చే సినిమాలు, మరాఠీ సినిమాల గురించి ఎక్కువమందికి సరైన అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కాన్స్‌ ఫెస్టివల్‌లో రెడ్‌ కార్పెట్‌ మీద నడవడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... సూర్య హీరోగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో శిరీష్‌ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు