మీటూ నేపథ్యంలో సినిమా.. జడ్జీ పాత్రలో అలోక్‌

1 Mar, 2019 20:26 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో, బుల్లి తెర మీద సంస్కారవంతమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన అలోక్‌ నాథ్‌పై కూడాఆరోపణలు వచ్చాయి. రచయిత, నిర్మాత వింటా నందా అలోక్‌ నాథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం.. ఆ తరువాత అలోక్‌ కోర్టులో ఫిర్యాదు చేయడం వంటివి తెలిసిందే. అయితే ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే అలోక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది.

అదేంటంటే మీటూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్‌లో తెరకెక్కిన మైనేభీ చిత్రంలో అలోక్‌ నాథ్‌ జడ్జీ పాత్రలో నటించారు. ఈ విషయం గురించి అలోక్‌ మాట్లాడుతూ..‘ప్రస్తుతం నా చేతిలో ఒక్క  సినిమా కూడా లేదు. ‘మైనే భీ’ అనే సినిమా చిత్రీకరణ కొన్ని రోజుల ముందే పూర్తైంది. ఇందులో నేను జడ్జి పాత్రలో నటించాను. మీకేమన్నా సమస్య ఉందా? నేను ఈ సినిమా చేస్తున్నానని మీరు బాధపడుతున్నట్లున్నారు. పేద నిర్మాతలకు ఈ సినిమాలోని నా పాత్ర అండగా నిలుస్తుంది. విడుదల కానివ్వండి’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు అలోక్‌. నిసార్‌ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనాలి రౌత్‌, షావర్‌ అలీ, ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించారు.

(చదవండి : వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ)

మరిన్ని వార్తలు