‘ఐఫా’కు దక్షిణాది సినీ పరిశ్రమ

5 Nov, 2015 02:31 IST|Sakshi
‘ఐఫా’కు దక్షిణాది సినీ పరిశ్రమ

చెన్నై, సాక్షి ప్రతినిధి : ఫార్చున్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రధాన స్పాన్సర్‌గా ఐఫా దక్షిణాది సినీ ఉత్సవాలను డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలో నిర్వహించారు.
 
  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ ప్రధాన నిర్వాహక సంస్థ విజ్‌క్రాఫ్ట్ డెరైక్టర్ విరాఫ్ సర్కార్ మాట్లాడుతూ భారతీయ సినిమాఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఐఫా 16 ఏళ్ల క్రితం ప్రారంభమైందని తెలిపారు. దక్షిణభారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ మాట్లాడుతూ హిందీ సినీ పరిశ్రమతో ప్రారంభమైన ఐఫా దక్షిణాదికి విస్తరించడం సంతోషదాయకమని చెప్పారు. కేవలం వినోదం కోసం గాక సామాజిక బాధ్యతతో ఈ వేడుకలను నిర్వహించడం గర్వకారణమన్నారు.
 
  ఏడాదికి వెయ్యి సినిమాలు నిర్మితమవుతున్న దక్షిణాదికి ఐఫా చేరుకోవడం సముచితమైన నిర్ణయమని భారత ఫిలిం ఫెడరేషన్ ఉపాధ్యక్షులు రవి కొట్టార్కర అన్నారు. ఐఫా వేడుకలతో దక్షిణాది ప్రతిభ ప్రపంచానికి తెలియాలని ప్రముఖ దర్శకులు పీ వాసు అన్నారు. అదాని గ్రూపు సీవోవో అన్షుమాలిక్ మాట్లాడుతూ ఐఫా పుట్టినపుడే ఆదాని పుట్టిందని, అదే స్థాయిలో ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. ఐఫా వేడుకల్లో అదాని భాగస్వామ్యం కావడం ఆనందకరమన్నారు.
 
 నిర్వాహకురాలు గీత మాట్లాడుతూ దక్షిణాది పరిశ్రమలోని టాలెంట్‌ను ప్రపంచానికి చాటేలా ఐఫా వేడుకలు సాగుతాయని, ఎంట్రీల ద్వారా విజేతల ఎంపిక జరుపుతామని తెలిపారు. విజేతల ఎంపిక పారదర్శకంగా సాగాలని నిర్మాత కే ప్రసాద్ సూచించారు. మీడియా పార్టనర్‌గా తామున్నందుకు గర్వపడుతున్నామని సన్‌నెట్‌వర్క్ ప్రతినిధి అనూజ అయ్యర్ అన్నారు. నటుడు మాధవన్, నటీమణులు హన్సిక, సిమ్రాన్, నమిత, రోహిణి, పూజాకుమార్ ఐఫాకు అభినందనలు తెలిపారు.