మళ్లీ హిందీలో...

15 Dec, 2014 23:26 IST|Sakshi
మళ్లీ హిందీలో...

 కొద్దిగా విరామం తరువాత అమల అక్కినేని ఇప్పుడు హిందీ తెరపై మెరిసిపోనున్నారు. అదీ ఏకంగా ప్రముఖ దర్శక, నిర్మాత మహేశ్‌భట్ చిత్రంలో! ‘‘టైమ్‌లెస్ బ్యూటీ అమల అక్కినేని మా ‘హమారీ అధూరీ కహానీ’ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేయడానికి అంగీకరించారు. చాలా ఆనందంగా ఉంది’’ అని మహేష్ భట్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దక్షిణాదిన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని, అక్కినేని ఇంటి కోడలైన తర్వాత అమల సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఆమె తెరపై కనిపించిన తెలుగు చిత్రం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలోని ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’.
 
 ఆ తర్వాత అమల దక్షిణాదిన వేరే సినిమా ఒప్పుకోలేదు కానీ, గత ఏడాది ఒక హిందీ చిత్రంలో తళుక్కున మెరిశారు. ప్రస్తుతం ‘ఉయిర్‌మై’ అనే తమిళ టీవీ ధారావాహికలో నటిస్తున్న అమల... ‘హమారీ అధూరీ కహానీ’లో పాత్ర నచ్చడంతో, నటించడానికి పచ్చజెండా ఊపారు. గతంలో ‘దయావాన్, కబ్ తక్ ఛుపే రహూంగీ’ తదితర హిందీ చిత్రాల్లో నటించారు. దక్షిణాదిన ఘనవిజయం సాధించిన ‘శివ’ హిందీ రీమేక్‌లో కూడా ఆమే కథానాయిక. ఆ విధంగా హిందీ ప్రేక్షకులకు అమల సుపరిచితురాలే. ఇక తాజా చిత్రం ‘హమారీ అధూరీ కహానీ’ చిత్రం విషయానికొస్తే.. ఇమ్రాన్ హష్మీ, విద్యాబాలన్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో మహేష్ భట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తల్లిదండ్రులు షిరీన్ మొహమ్మద్ అలీ, నానాభాయ్ భట్, సవతి తల్లి జీవితాల ఆధారంగా మహేష్  భట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.