అడవుల్లో చిక్కుకున్న అమలాపాల్‌

21 Nov, 2018 10:50 IST|Sakshi

సినిమా: సంచలన నటి అమలాపాల్‌ కూడా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకి అయిపోయింది. అలాంటి చిత్రాలామె చేతిలో ఇప్పుడు రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి అదో అంద పరవై పోల చిత్రం. అడ్వెచర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెంచరీ ఇంటర్‌నేషనల్‌  ఫిలింస్‌ పతాకంపై జాన్స్‌ నిర్మిస్తున్నారు. నవదర్శకుడు కేఆర్‌.వినోద్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకడు తెలుపుతూ ఇది అడ్వెంచర్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని పశ్చిమ అడవుల్లో జరిగే ఉత్కంఠభరితంగా సాగే చిత్రం అదో అంద పరవై పోల అని చెప్పారు.

ప్రముఖ యువ వ్యాపారవేత్త అయిన నటి అమలాపాల్‌ కారడవుల్లో చిక్కుకుంటుందన్నారు. అక్కడ నుంచి ఆమె ఎలా బయటపడుతుందన్నదే చిత్ర కథ అని తెలిపారు. అడవుల్లో చిక్కుకున్న అమలాపాల్‌ ఎలాంటి కష్టాలు పడుతుండి? అడవి మృగాలు, అడవి మనుషుల బారిన పడి ఎలా తప్పించుకుంటుంది లాంటి కథ, కథనాలతో ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. ఇందులో అమలాపాల్‌తో పాటు ఆశీష్‌ విద్యార్థి అటవీశాఖ అధికారిగా ముఖ్యపాత్రను పోషిస్తున్నారని తెలిపారు. వీరితో పాటు జనత్, హౌస్‌ఫుల్‌ 3, డేంజర్స్‌ ఐసక్‌ వంటి బాలీవుడ్‌ చిత్రాల ఫేమ్‌ సమీర్‌ కోచర్‌ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారని చెప్పారు. చిత్రం అధిక భాగం అడవుల్లోనే సాగుతుందన్నారు. నటి అమలాపాల్‌  ఈ చిత్రం కోసం ఎతైన చెట్లు ఎక్కడంతో పాటు పలు సాహసాలతో కూడిన పోరాట సన్నివేశాల్లో  నటించినట్లు తెలిపారు. ఆమె సహకారం మరవలేనిదని అన్నారు. ఎలాంటి సన్నివేశాన్నైనా సింగిల్‌ షాట్‌లో నటించేసేవారని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి శరత్‌కుమార్‌ ఛాయాగ్రహణం, జాక్స్‌ బిజాయ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు