మణిరత్నం చిత్రంలో అమలాపాల్‌

7 May, 2019 08:44 IST|Sakshi

తమిళసినిమా: సంచలన నటి అమలాపాల్‌కు మరో లక్కీచాన్స్‌ లభించనుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం కోసం ఒక తపస్సు చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే నాటి దివంగత ముఖ్యమంత్రి, మక్కళ్‌ తిలగం ఎంజీఆర్‌ వంటి నటుడే నటించాలని కలలు కన్న చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. ఆ తరువాత కమలహాసన్‌ వంటి వారు కూడా ఆశ పడిన నవల అది. కాగా ఇంతకుముందు మణిరత్నం పొన్నియిన్‌సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేసి బడ్జెట్‌ వర్కౌట్‌ కాకపోవడంతో తన ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా మరోసారి తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన పొన్నియిన్‌సెల్వన్‌ చిత్రాన్ని వెండితెర కళాఖండంగా చెక్కడానికి సిద్ధం అయ్యారు. ఇంతకుముందు నటుడు విజయ్, తెలుగు నటుడు మహేశ్‌బాబు వంటి స్టార్స్‌తో పొన్నియన్‌సెల్వన్‌ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించిన మణిరత్నం ఈ సారి  విక్రమ్, జయంరవి, కార్తీ, కీర్తీసురేశ్, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ వంటి ఇండియన్‌ స్టార్స్‌ను తన చిత్రంలో పాత్రదారులుగా ఎంచుకున్నారు. అయితే ఇందులో అగ్రనటి నయనతార కూడా ఒక కీలక పాత్రను పోషించనుందనే ప్రచారం జోరందుకున్నా, ఆ తరువాత ఆమె కాల్‌షీట్స్‌ కేటాయించలేని పరిస్థితి కారణంగా మరో అగ్రనటి అనుష్క ఆ పాత్రను చేయబోతోందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

తాజాగా మరో సంచలన వార్త ఏమిటంటే పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో మరో సంచలన నటి అమలాపాల్‌ను కూడా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది. అందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు గ్లామర్‌ పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చిన అమలాపాల్‌ ఈ మధ్య హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలపై దృష్టి సారిస్తోంది. ఆమె నటిస్తున్న అడై, అదో అంద పరవై పోల వంటి చిత్రాలు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలే. తాజాగా మణిరత్నం ఆఫర్‌ చేసిన హిస్టారికల్‌ పాత్రలో నటించే లక్కీ అవకాశాన్ని ఈ సంచలన నటి అంగీకరిస్తుందా?  అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ అవకాశం ఇస్తోంది దర్శకుడు మణిరత్నం. కాబట్టి పొన్నియిన్‌సెల్వన్‌ చిత్రంలో స్టార్‌ నటీనటుల్లో నటి అమలాపాల్‌ను కూడా చూడవచ్చు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని సమాచారం. దీన్ని మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌ సంస్థతో కలిసి రిలయన్స్‌ సంస్థ నిర్మించడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ ఏడాది చివరిలో పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది.   

మరిన్ని వార్తలు