మేఘాకు జాక్‌పాట్‌

26 Jun, 2019 10:08 IST|Sakshi

సినిమా రంగంలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. ఏ చిత్రంలో ఎవరు ఉంటారో, ఎవరు వైదొలుగుతారో చెప్పలేం. ఇప్పుడు నటి అమలాపాల్‌ విషయంలో ఇదే జరిగింది. చిత్ర ప్రారంభం నుంచి ఈ అమ్మడి పేరు మారుమోగింది. తీరా చిత్ర షూటింగ్‌ మొదలైన తరువాత తను లేదంటున్నారు. అమలాపాల్‌ ఇప్పుడు హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాదు తను నటించిన తాజా చిత్రం ఆడై టీజర్‌తో సంచలనం సృష్టించారు.

తాజాగా మరోసారి ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. నటుడు విజయ్‌సేతుపతి నటిస్తున్న 33వ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా వెంకట కృష్ణ రోహంత్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. చంద్రా ఆర్ట్స్‌ పతాకంపై ఇసక్కిదురై నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌సేతుపతికి జంటగా నటి అమలాపాల్‌ను ఎంపిక చేశారు.

దర్శకుడు మగిళ్‌ తరుమేని ప్రతినాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం పళనిలో చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇది మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్‌సేతుపతి సంగీత కళాకారుడిగా నటిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రం నుంచి అమలాపాల్‌ వైదొలిగారు. కాల్‌షీట్స్‌ సమస్య కారణంగానే అమలాపాల్‌ చిత్రం నుంచి తప్పుకున్నట్టుగా చిత్ర వర్గాలు చెబుతున్నారు.

ఏదేమైనా ఇప్పుడు అమలాపాల్‌ స్థానాన్ని మరో నటి మేఘాఆకాశ్‌ భర్తీ చేశారు. ఇది ఈమెకు జాక్‌పాట్‌ అనే చెప్పాలి. ఎందుకంటే మేఘాఆకాశ్‌ తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నా సరైన సక్సెస్‌ను ఈ అమ్మడు చూడలేదు. కాలాలో చిన్న పాత్రలో నటించినా ఆ విజయం రజనీకాంత్‌కే చెందుతుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల శింబుకు జంటగా వందా రాజావాదాన్‌ వరువేన్‌ చిత్రంలో కథానాయకిగా నటించిన మేఘాఆకాశ్‌కు ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది.

ఈ సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం ఈ అమ్మడికి లభించడం నిజంగా లక్కీనే. ఈ చిత్రం షూటింగ్‌లో మేఘాఆకాశ్‌ మంగళవారం జాయిన్‌ అయ్యారని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రం అయినా ఈ అమ్మడి జాతకాన్ని మార్చుతుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు