నిన్న హన్సిక.. నేడు అమలాపాల్‌

18 Dec, 2018 11:20 IST|Sakshi

సినిమా: ఎదుటి వారికి చెప్పడానికే నీతులు అన్నారో రచయిత. అది అక్షరాలా సత్యం. నిషిద్ధం కాకపోయినా, ఆరోగ్యానికి హానికరమైన మద్యం  సేవించడం, పొగ తాగడం వంటి చర్యలు మంచి అలవాట్లు కాదని  సెలబ్రిటీలు చెబుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు అలా నటించి మరీ చూపిస్తుంటారు.అందుకు భారీ మొత్తంలో పారితోషికాలు పుచ్చుకుంటారు అది వేరే సంగతి. వారితో చెప్పిస్తే మంచి ఫలితం ఉంటుందనే అలా చెప్పిస్తుంటారు. అయితే అదే పారితోషికం కోసం కొందరు భామలు పొగ తాగడం, మద్యం సేవించడం లాంటి సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇటీవల నటి హన్సిక మహా చిత్రంలో కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో సిగరెట్‌ పట్టుకుని నోటి నుంచి పొగను సుడులు సుడులుగా వదులుతన్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలై వివాదానికి దారి తీసింది. ఆ పోస్టర్‌ విషయంలో హన్సికపై కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. ఆ వివాదం సమసిపోకముందే ఇప్పుడు నటి అమలాపాల్‌ మరో వివాదానికి తెర లేపింది.

ఇలాంటి వివాదాలు, విమర్శలు ఆ కేరళా కుట్టికి కొత్తేమీ కాదు. ఇటీవలే లుంగీ ఎగ్గటి చేతిలో సారా సీసా పట్టుకుని అడవిలోని మందు బాబుల స్పాట్‌కెళ్లిన దృశ్యాన్ని అమలాపాల్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసి నెటిజన్లకు మస్త్‌ పని చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆమె అభిమానులు రకరకాలుగా కామెంట్స్‌ చేశారు. అయితే అమలాపాల్‌ ఆ ఫోజ్‌ను ఎంజాయ్‌ చేసిన వారూ చాలా మందే ఉన్నారనుకొండీ. తాజాగా ఆ అమ్మడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మొన్న మద్యం సీసాతో కనిపిస్తే, ఈ సారి దమ్మారో దమ్‌ అంటూ పొగ తాగుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. పైగా తాను కావాలని అలా సిగరెట్‌ తాగలేదని, ఒక హాలీవుడ్‌ అభిమాని కోరికను నెరవేర్చడానికి అలా చేశానని సమర్ధించుకుంటోంది. సర్కార్‌ చిత్ర విషయంలో విజయ్‌ను, మహా చిత్ర విషయంలో నటి హన్సికను విమర్శలతో ఉతికి ఆరేసిన రాజకీయ పా´ర్టీ నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు ఇప్పుడు అమలాపాల్‌ను మాత్రం వదులుతారా? అయినా ఇలాంటి సంఘటనలతోనే ఉచిత ప్రచారం పొందాలనుకునే అమలాపాల్‌ వంటి తారలు విమర్శలను పట్టించుకుంటారా?

మరిన్ని వార్తలు