మగరాయుడిలా...

10 Apr, 2017 13:09 IST|Sakshi
మగరాయుడిలా...

అమలాపాల్ ఒక్కసారిగా మగరాయుడిలా మారిపోయిందేంటి? ఈ పంచెకట్టు ఏంటి? ఈ తలపాగా ఏంటి? ఈ గెటప్ చూస్తే... ఎవరికైనా ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతాయి. ఓ తమిళ చిత్రం కోసం ఈ మలయాళ భామ ఈ అవతారం ఎత్తారు. నటుడు పార్తీబన్ దర్శకత్వం వహిస్తున్న ‘కథై తిరైకథై వసనం’ చిత్రం కోసం అమలాపాల్ ఈ గెటప్ వేశారు. నిజానికి ఈ సినిమాలో అమలాపాల్‌ది అతిథి పాత్రే. అయితే... ఆ పాత్రలో ఎన్నో కోణాలుంటాయట. ఓసారి ఆనందంగా ఉంటుందట.
 
  మరోసారి బాధగా కనిపిస్తుందట. ఇంకోసారి మూడీగా అనిపిస్తుందట. ఒక్కోసారి బీభత్సమైన కోపంతో రెచ్చిపోతుందట. ఒకే పాత్రలో ఇన్ని కోణాలుండటం నిజంగా అరుదే. ఈ పాత్ర తీరుతెన్నులు పార్తీబన్ చెప్పగానే... ఉత్కంఠకు లోనై.. వెంటనే ‘ఓకే’ చెప్పిందట అమలాపాల్. కథ రీత్యా ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో తాను మగరాయుడుగా కూడా కనిపించాలి.
 
 
 అందుకే ఈ పంచెకట్టు, తలపాగా. ఈ పాత్ర గురించి అమలాపాల్ మాట్లాడుతూ -‘‘పార్తీబన్ సార్... ఈ పాత్ర గురించి చెప్పగానే... నిజంగానే  ఉద్వేగానికి గురయ్యాను. ముఖ్యంగా ఈ గెటప్‌లో నన్ను నేను చూసుకోగానే... నాకు నేనే కొత్తగా కనిపించాను’’ అంటూ ఆనందాన్ని వెలిబుచ్చారు.