శ్రీను వైట్ల గొప్ప నటుడు

11 Nov, 2018 02:28 IST|Sakshi
నవీన్, తమన్, రవితేజ, ఇలియానా, శ్రీను వైట్ల, మోహన్, రవిశంకర్‌

రవితేజ

‘‘శ్రీను వైట్ల సినిమాలంటేనే ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తూ చేస్తాం. ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ సినిమా కూడా చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. మా కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా. ఫస్ట్‌ చిత్రం ‘నీకోసం’ కొంచెం ఎమోషనల్‌ లవ్‌స్టోరీ. ‘వెంకీ, దుబాయ్‌ శీను’ ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. ఈ రెండింటి కలయిక ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నా’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’కి డబ్బింగ్‌ చెప్పేటప్పుడు విపరీతంగా నవ్వాను.. అంత ఎంజాయ్‌ చేశాను. తమన్‌తో ఇది 9వ సినిమా. నెక్ట్స్‌ పదో సినిమా. హిట్‌కి, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా నాకు ఎప్పుడూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇస్తాడు. తమన్‌.. మనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి.

నవీన్, రవి, మోహన్‌గార్లు సైలెంట్‌గా ఉన్నా వెటకారం ఎక్కువ. వీరితో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ. అంతమంచి ప్రొడక్షన్‌ హౌస్‌ ఇది. ఇలియానా.. ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. షీ ఈజ్‌ డార్లింగ్‌. మనం మళ్లీ పని చేస్తాం. శ్రీను వైట్ల కామెడీ, సెన్సాఫ్‌ హ్యూమర్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ సూపర్‌గానే ఉంటుంది. తను గొప్ప నటుడు. అతను చేసి చూపించినదాంట్లో మనం 50 శాతం చేస్తే చాలు విపరీతమైన పేరొస్తుంది. ఈ సినిమాలోని అందరి పాత్రల్లో శ్రీను కనిపిస్తారు.. ఇలియానాలో కూడా (నవ్వుతూ)’’ అన్నారు.

శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ కథని నేను, వంశీ రెండు నెలలు వర్కవుట్‌ చేసి, ఓ షేప్‌కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ప్రవీణ్, మరో అబ్బాయి ప్రవీణ్‌ జాయిన్‌ అయ్యి రచనా సహకారం అందించారు. మేం నలుగురం 8 నెలలు కష్టపడి స్క్రిప్ట్‌ పూర్తి చేశాం. ఈ సినిమా స్క్రిప్ట్‌ మేకింగ్‌ని చాలా ఎంజాయ్‌ చేశాం. ఈ ప్రయాణం బాగుంది. ప్రయాణం బాగున్నప్పుడు ఫలితం కూడా అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముతాను. ఈ సినిమాని మీరు ఆశీర్వదిస్తారు, పెద్ద హిట్‌ చేస్తారని 100 శాతం నాకు నమ్మకం ఉంది.

రవితేజ నా ట్రబుల్‌ షూటర్‌. నేనెప్పుడైనా డల్‌గా ఉన్నప్పుడు ఎనర్జీ ఇచ్చి మళ్లీ పైకి తీసుకొస్తుంటాడు. అలా ‘వెంకీ’ అప్పుడు, ‘దుబాయ్‌ శీను’ అప్పుడు చేశాడు.. ఇప్పుడు ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’కి చేశాడు. తనకి నామీద ఉన్న నమ్మకానికి నేనెప్పుడూ థ్యాంక్‌ఫుల్‌గానే ఉంటాను. థ్యాంక్యూ రవి. తను ఇచ్చిన ఎనర్జీయే ఈ సినిమా. మేం రాసుకున్న కథని అలాగే తీయగలిగాం. దానికి కారణం నిర్మాతలు. నేను చేసిన సినిమాల్లో చాలా లగ్జరీగా చేసిన సినిమా ఇది.

రెండు షెడ్యూల్స్‌ అమెరికాలో చేసినా నిర్మాతలు నాకు బాగా సహకరించినందుకు చాలా థ్యాంక్స్‌. వెంకట్‌ సి.దిలీప్‌ మంచి విజువల్స్‌ ఇచ్చాడు. తమన్‌ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఇలియానాతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నా.. ఇప్పటికి కుదిరింది. నేను ఫోన్‌ చేయగానే నటించేందుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్‌. తన డెడికేషన్‌ ప్రత్యక్షంగా చూశాను. మంచి నటి. తనతో నేను కూడా మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి. కష్టపడి డబ్బింగ్‌ చెప్పినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు.


ఇలియానా మాట్లాడుతూ– ‘‘మిమ్మల్ని (ప్రేక్షకులు) చాలా మిస్‌ అయ్యాను.. మళ్లీ వెనక్కి వచ్చాను.. చాలా సంతోషంగా ఉంది.. లవ్‌ యూ. ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ చిత్రంలో తొలిసారి డబ్బింగ్‌ చెప్పాను. మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. నన్ను నమ్మినందుకు శ్రీనుగారికి థ్యాంక్స్‌. రవిగారితో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. తను రియల్లీ గుడ్‌ ఫ్రెండ్‌. తనతో చాలా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్‌ చక్కని పాటలు ఇచ్చారు’’ అన్నారు.


సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ–  ‘‘రవితేజగారి అభిమానులకు హాయ్‌. మీరిచ్చే కిక్కే వేరు. 100 సినిమాలు ఎలా చేశానని నాకే తెలీదు. ఇదంతా రవితేజగారు ఇచ్చిన కిక్కే. ఆయన ఇచ్చే ఎనర్జీ నా బండికి పెట్రోల్‌లాగా నడిపిస్తూ ఉంటుంది. ‘పవర్‌’ సినిమా ఆడియోలో చెప్పాను. ఆయనకు ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’  అయితే.. నాకు అమ్మా నాన్న రవితేజ. అందులో నిజం ఉంది. మ్యూజిక్‌ చేయడానికి నాకు ధైర్యం రాలేదు. ‘నువ్వు చేయగలవు.. చేస్తావు’ అంటూ ఆయన ఇచ్చిన కిక్, ధైర్యం, నమ్మకం, బలంవల్లే 100 సినిమాలు చేయగలిగాను.

రవితేజగారితో 9 సినిమాలు చేశాను.. ఏ హీరోతోనూ చేయలేదు.  శ్రీను వైట్లగారితోనూ 5 సినిమాలు చేశాను. ఈ రోజుకి కూడా ‘దూకుడు’ పాటలు వింటుంటే నేనేనా కంపోజ్‌ చేసింది అనిపిస్తుంది. అంత ఈజీగా ఆయన నా వద్ద నుంచి ట్యూన్స్‌ రాబట్టుకున్నారు. మనకు నచ్చిన హీరో, డైరెక్టర్‌తో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రావడంకంటే అదృష్టం ఏం ఉంటుంది. రవితేజని మాస్‌ మహారాజా అని పిలవను. ఆయన మనసే మహారాజ’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో ఈ సినిమా చేసినందుకు రవితేజ, శ్రీను వైట్లగార్లకు థ్యాంక్స్‌.

తమన్‌గారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. మళ్లీ ఆయనతో పని చేయాలనుకుంటున్నాం. శ్రీను వైట్లగారి గత సినిమాల్లో ఉన్నట్లు చాలామంది కమెడియన్స్‌ ఇందులో ఉన్నారు. టోటల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.  శ్రీను వైట్లగారు దర్శకునిగానే కాదు.. మా నిర్మాతల రోల్‌ కూడా తీసుకున్నారు. ఓ మూవీ బడ్జెట్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ చేతిలో ఉంటుందని వంద శాతం నిరూపించారు’’ అన్నారు. చిత్రనిర్మాతలు వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి, నిర్మాతలు అనీల్‌ సుంకర, కిరణ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాశ్, నటులు గౌతంరాజు, గిరి, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, విశ్వ, పారిశ్రామికవేత్త రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు