మా వాళ్ళలో మార్పు తేవాలనే ఈ సినిమా తీశా!

13 Apr, 2015 22:45 IST|Sakshi
మా వాళ్ళలో మార్పు తేవాలనే ఈ సినిమా తీశా!

 ‘‘చిన్నతనం నుంచీ అంబేడ్కర్ ప్రభావం నాపై చాలా ఉంది. అంబేడ్కర్ ప్రేరణతో మావాళ్ళందరిలోనూ మార్పు తీసుకు రావాలనే ఈ ‘అంబేద్కర్’ (1992) సినిమా తీశాను. దీని కోసం తొమ్మిదేళ్లు కష్టపడ్డా. ఆస్తులు కూడా అమ్ముకున్నా. అంబేడ్కర్ పుట్టిన ప్లేసు, చదివిన స్కూలు, వాడిన పెన్ను, తిరిగిన కారు... ఇలా అన్నీ చూశా. అంబేడ్కర్ భార్య డాక్టర్ సవితను కూడా కలిశా. ఈ సినిమాను నేను డబ్బు కోసం చేయలేదు. అంబేడ్కర్ ఆశయాలు ప్రజలందరికీ తెలియాలి. ఆ లక్ష్యంతోనే ఈ సినిమా చేశా. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావుగారు నా వెన్నంటి ఉండి నడిపించారు.
 
 మా నాన్న రామయ్య, అమ్మ ఆదిలక్ష్మి ఇచ్చిన ప్రోత్సాహమే నన్నీ ఒంటరిపోరులో విజయం సాధించేలా చేసింది. మా కన్నా ముందు మరాఠీలో, కన్నడంలో అంబేద్కర్‌పై సినిమాలు చేశారు. కన్నడం సినిమా కేవలం ఆయన బాల్యానికే పరిమితం. మరాఠీ కూడా దాదాపుగా అంతే. పూర్తి స్థాయిలో ఆయన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన సినిమా అంటే మాదే. నేను ఈ సినిమాను మేధావుల కోసం తీయలేదు. సామాన్య ప్రజల కోసం తీశాను. ఆ పరంగా, నేను విజయం సాధించాను. మా తరువాత మమ్ముట్టితో అంబేడ్కర్ సినిమా తీసినవాళ్లు కూడా నా సలహాలు, సూచనలు అడిగారు. ఇరవై మూడేళ్ళ క్రితం వచ్చినా, ఇప్పటికీ పెద్దగా ప్రచారానికి నోచుకోని ఈ సినిమా ఇంకా ఎందరికో చేరువ కావాలి. అందుకే మంగళవారం నాడు ఇంగ్లీషు సబ్-టైటిల్స్‌తో డీవీడీలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాను.’’